పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్త
సీలేరు: పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక సామాజిక పరిస్థితుల ఆధారంగా న్యాయం చేస్తామని గూడెంకొత్తవీధి తహసీల్దార్ అన్నాజీరావు అన్నారు. బుధవారం పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలైన దుప్పలువాడ పంచాయతీ శాండికోరి, బుసికొండ, సీలేరు పంచాయతీ పార్వతీనగర్ ప్రాంతాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఏపీ జెన్‌కో స్థలంలో ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నందున అర్హులకు న్యాయం జరిగేలా సర్వే నిర్వహించి కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు. కుటుంబంలో యజమానితోపాటు 18 ఏళ్లు నిండిన కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేస్తామన్నారు. పెళ్లయిన ఆడపిల్లలు అర్హులు కాదన్నారు. కుటుంబంలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో వచ్చిన వారికి అర్హతను బట్టి ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణానికి అటవీశాఖ నుంచి పర్యావరణ అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. అనంతరం మూడు గ్రామాల నిర్వాసితులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు వల్ల సీలేరు ప్రజలకు నష్టం కలిగితే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సర్పంచ్ దుర్జో తదితరులు కూడా వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఎస్‌ఈ సివిల్ హనుమ, ఈఈ భాస్కర్ రావు, ఏడీఈ అప్పలనాయుడు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
గూడెంకొత్తవీధి తహసీల్దార్ అన్నాజీరావు


