రాజకీయ పడగ
జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయులు, విద్యార్థుల బృహత్ సమావేశాలు (మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్) విమర్శలకు తావిచ్చాయి. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సామర్థ్యం, సౌకర్యాలపై చర్చ జరిగేందుకు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాలు చాలాచోట్ల లక్ష్యానికి విరుద్ధంగా జరిగాయి. పాఠశాల స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించకుండా టీడీపీ నేతలకు అధికారులు ప్రాధాన్యమిచ్చారు. దీంతో సభలు టీడీపీ ప్రచార కార్యక్రమాన్ని తలపించాయి. కనీస ఏర్పాట్లు చేయకపోవడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సమస్యలు ఎదుర్కొన్నారు. టీడీపీ నేతల ఊకదంపుడు ప్రసంగాలు విసుగు కలిగించాయి.
డుంబ్రిగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎండలో కూర్చున్న విద్యార్థులు
డుంబ్రిగుడ కేజీబీవీలో నేలపై కూర్చున్న విద్యార్థినులు
సర్కారు బడులపై
పాడేరు : జిల్లాలో చాలా పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ మొక్కుబడిగా నిర్వహించడంతో తమను ఎందుకు పాఠశాలలకు రప్పించారో తెలియక కొంతమంది తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. సకాలంలో ప్రారంభం కానందున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పెట్టిన భోజనాలు రుచికరంగా లేకపోవడంతో ప్రతిరోజు మా పిల్లలకు ఇలాంటి భోజనాలు పెడుతున్నారని వారు సందేహం వ్యక్తం చేశారు.
● పాడేరు మండలం లగిసపల్లి కేజీబీవీలో షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికి సుమారు మూడు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 10.30 గంటలకు కలెక్టర్ దినేష్‌కుమార్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ప్రకటించారు. దీంతో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ గిడ్డి ఈశ్వరి రాకకోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మూడు గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చింది. వీరికి స్వాగతం పలికేందుకు విద్యార్థులు మండుటెండలో నిరీక్షించాల్సి వచ్చింది. విద్యార్థులకు విజ్ఞానం పెంచేందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు ప్రదర్శించకుండా హిందూపురం ఎమ్మెల్యే, బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రదర్శించడంపై తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.
● మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ సందర్భంగా కొన్ని పనులను పాఠశాల విద్యార్థులతో చేయించడం అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. పాడేరు మండలం శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులతో ప్రమాదకర పరిస్థితుల మధ్య చెట్లు ఎక్కించి కొమ్మలు సేకరించారు. పక్కనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ తీగలు ఉన్నందున అదృష్టవశాత్తూ విద్యార్థులు క్షేమంగా కిందికి దిగిపోయారు. ఇదే పాఠశాలలో మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన సమావేశం మూడుగంటల వరకు సాగింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆకలితో అలమటించాల్సి వచ్చింది.
గింజర్తిలో బహిష్కరణ
కొయ్యూరు: చింతలపూడి పంచాయతీ గింజర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు మెగా పేరెంట్స్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం బహిష్కరించారు. పాఠశాల గేటు బయట ఉండి దానిని మూసివేశారు. ఎక్కువ భవనాలు, ఖాళీ స్థలం ఉన్నప్పటికీ గింజర్తిని ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేయకుండా తక్కువ సౌకర్యాలున్న చింతలపూడి పాఠశాలను ఆదర్శ పాఠశాలగా ఏర్పాటు చేశారు. దీంతో పక్కనున్న గింజర్తిలో చదువుతున్న 3,5 తరగతుల పిల్లలు చింతలపూడి వెళ్లాల్సి వస్తోంది. దీనిని నిరసిస్తూ తల్లిదండ్రులు సమావేశం జరిపేందుకు అభ్యంతరం తెలిపారు. అసలు సమావేశం వద్దని స్పష్టం చేశారు. చింతలపూడికి బదులుగా గింజర్తిని ఆదర్శ పాఠశాలగా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సమావేశం నిర్వహించలేదని విద్యాకమిటీ చైర్మన్ అప్పారావు తెలిపారు.
అసౌకర్యాల మధ్య..
డుంబ్రిగుడ: మండంలంలోని మెగా పేరెంట్స్, ఉపాధ్యాయుల సమావేశాలు అసౌకర్యాల మధ్య నిర్వహించడంతో ఇబ్బందులు పడ్డారు. డుంబ్రిగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో టెంట్లు ఏర్పాటుచేయకుండా విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టారు. స్థానిక కేజీబీవీ నిర్వహించిన సమావేశానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కూటమి నేతల హవా కనిపించింది. ప్రజలనుంచి ఎన్నుకోబడిన వారు ఒక్కరిని కూడా ఆహ్వానించలేదు. డుంబ్రిగుడలో బాలుర గిరిజన సంక్షేమ, బాలికల గిరిజన సంక్షేమ, ప్రభుత్వ ఉన్నత, కేజీబీవీలో నిర్వహించిన సమావేశాలకు విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు సక్రమంగా భోజనాలు అందకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొన్నారు.
భోజనం బాగోలేదని ఆరోపణ
రంపచోడవరం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పెట్టిన భోజనం ఏమాత్రం రుచికరంగా లేదని మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్‌కు హాజరైన కొంత మంది తల్లిదండ్రులు ఆరోపించారు. కనీసం మీటింగ్ రోజునైనా మంచి భోజనం పెట్టవచ్చు కదా అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్‌లో టీడీపీ నేతలకు ప్రాధాన్యం పాఠశాల స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధుల విస్మరణ
అధికారపార్టీ ప్రచార కార్యక్రమంలా సమావేశాలు రంపచోడవరంలో తల్లిదండ్రులకు ఉడికీ ఉడకని భోజనం
తినకుండా వెనుదిరిగిన వైనం విద్యాశాఖ తీరుపై గింజర్తిలో విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన
డుంబ్రిగుడలో విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన నిర్వాహకులు చంద్రబాబు ప్రభుత్వం కనీస ఏర్పాట్లు చేయలేదని విమర్శ
రాజకీయ పడగ
రాజకీయ పడగ
రాజకీయ పడగ


