గిరిజన విద్యార్థినిమృతదేహానికి పోస్టుమార్టం
రంపచోడవరం: మండలంలోని తామరపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాల (జీపీఎస్)లో మృతి చెందిన కుంజం జానుశ్రీ మృతదేహానికి శుక్రవారం ఏరియా ఆసుపత్రిలోపోస్టుమార్టం నిర్వహించారు. పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్న ఈమె గురువారం మధ్యాహ్నం ఆడుకుంటూ పాఠశాలలోనే స్పృహ కోల్పోయి కుప్పకూలిపోవడం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికను స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించవద్దని తల్లిదండ్రులు కుంజం సోమన్నదొర, బాపనమ్మ, గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు కోరారు. కేసు నమోదు చేయడంతో పోస్టుమార్టం తప్పనిసరి అని ఎస్‌ఐ వెంకట్రావు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి ఏరియా ఆస్పత్రికి వచ్చారు. పరిస్థితిపై వైద్యులు, పోలీసులతో మాట్లాడారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు అభ్యర్థన మేరకు పోస్టుమార్టం నిర్వహించకుండా మృతదేహానికి వారికి అందజేయాలన్నారు.అయితే నిబంధనలు మేరకు పోస్టుమార్టం చేయాలని, కేసు నమోదు కావడమే ఇందుకు కారణమని వారు స్పష్టం చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ బాలిక కుటుంబానికి ఆర్థికసాయం అందజేశారు. వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పండా రామకృష్ణదొర, ఇతర వైఎస్సార్ సీపీ నాయకులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే వరకు అన్ని కార్యక్రమాలు దగ్గర ఉండి చూసి వారికి తోడుగా నిలిచారు.


