ఆరు బోట్లు ప్రారంభం
చింతపల్లి: ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన తాజంగి జలాశయం వద్ద పర్యాటకుల సౌకర్యార్థం పర్యాటక వికాస్ సమకూర్చిన ఆరు బోట్లను తాజంగి సర్పంచ్ వంతల మహేశ్వరి శుక్రవారం ప్రారంభించారు. 2019 లో ఐటీడీఏ ఆధ్వర్యంలో స్థానిక గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ ఈ జలాశయం వద్ద సాహస క్రీడలను ఏర్పాటుచేశారు. వీటి నిర్వహణతో ఉపాధి పొందే అవకాశాన్ని పర్యాటక వికాస్ కమిటీ కల్పించారు. బోటు షికారుకు నాలుగు బోట్లను కూడా ఐటీడీఏ ఏర్పాటు చేసింది. వీటిలో రెండు ఏడాది కిందట పాడై పోగా, మరో రెండు నామమాత్రంగా వినియోగంలో ఉన్నాయి. దీంతో జలాశయంలో బోటు షికారుకు బ్రేకు పడింది. ప్రస్తుతం పర్యాటక సీజన్ ప్రారంభం కావడంతో ఐటీడీఏ అధికారుల సూచనలతో పర్యాటక వికాస్ ఆధ్వర్యంలో ఆరు బోట్లను కొనుగోలు చేశారు. దాంతో శుక్రవారం నుంచి ఈ బోట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ బోట్ల షికారుకు పర్యాటకులు నుంచి రూ. వంద వసూలు చేయాలని నిర్ణయించారు. పర్యాటక వికాస్ అధ్యక్షుడు శెట్టి శంకరరావు, సభ్యులు పాల్గొన్నారు.


