భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు
పాడేరు ఐటీడీఏ పీవో
తిరుమణి శ్రీపూజ హెచ్చరిక
చింతపల్లి: విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి మండలంలోని వంగసార బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కొంతసేపు విద్యార్థినులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగనం, స్టాక్ రూమ్, వంటశాలను ఆమె పరిశీలించారు.ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యత, రుచితో కూడిన మంచి భోజనాన్ని మెనూ ప్రకారం పెట్టాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.
సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు
పాడేరు రూరల్: సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీ పూజ తెలిపారు. జిల్లా కేంద్రం పాడేరులో సూత్రీకరణ సాంకేతిక సంస్థ (హర్యానా) సౌజన్యంతో రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య (గుంటూరు) ఆధ్వర్యంలో శుక్రవారం పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు, పాడి రైతులకు నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆమె మాట్లాడారు. గ్రామ స్థాయిలో సుస్థిరమైన సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన పంటలు పండించడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. సంబంధింత అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రసాయన ఎరువుల వినియోగాన్ని మానుకోవాలని సూచించారు. అనంతరం రైతులకు మందులు, వివిధ రకాల విత్తనాల కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్‌జీడీసీ ఎఫ్‌ఎల్ ఎండీ డాక్టర్ అమరేంద్రకుమార్, జిల్లా డీహెచ్‌వో జయరాజు, పశుసంవర్ధక శాఖ వైద్యాధికారులు పాల్గొన్నారు.
పిల్లల భవిష్యత్‌పై చర్చించేందుకు చక్కని అవకాశం
అరకులోయటౌన్: పిల్లల భవిష్యత్‌పై చర్చించేందుకు పేరెంట్, టీచర్ మీటింగ్ చక్కని అవకాశమని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. శుక్రవారం అరకులోయ మండలం రవ్వలగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేవలం చదువు మాత్రమే కాకుండా ఆరోగ్యం, క్రీడలు, ఇతర సామాజిక అవసరాల కోసం చర్చించుకునేందుకు ఇదొక గొప్ప అవకాశం అన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన పిరమిడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సమావేశంలో సీఐ ఎల్.హిమగిరి, జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి, ఏటీడబ్ల్యూవో వెంకటరమణ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.


