వణుకుతున్న మన్యం
● దట్టంగా పొగమంచు, పెరుగుతున్న
చలి తీవ్రత
● అరకువ్యాలీలో 11.1 డిగ్రీల
కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు
చింతపల్లి: అల్లూరి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గడచిన వారం రోజులుగా మంచు దట్టంగా కురుస్తోంది. చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారం అరకువ్యాలీలో 11.1 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
● పాడేరు డివిజన్ పరిధి పెదబయలులో 12.1డిగ్రీలు, డుంబ్రిగుడలో 12.6 డిగ్రీలు, హుకుంపేటలో 13.7, జి.మాడుగులలో 13.6 డిగ్రీలు, పాడేరులో 15.5 డిగ్రీలు, చింతపల్లిలో 15.8 డిగ్రీలు, కొయ్యూరులో 16.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఏడీఆర్ పేర్కొన్నారు.
● రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 15.8 డిగ్రీలు, మారేడుమిల్లిలో 16.4 డిగ్రీలు, అడ్డతీగలలో 17.3 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 17.4 డిగ్రీలు, రంపచోడవరంలో 17.1 డిగ్రీలు, గంగవరంలో 22.3 డిగ్రీలు నమోదుకాగా చింతూరు డివిజన్ చింతూరులో 17.8 డిగ్రీలు, ఎటపాకలో 18.5 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు.
ముంచంగిపుట్టు: మండలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. గిరిజన గ్రామాలపై చలి పంజా విసురుతోంది. మంచు దట్టంగా కురుస్తుండడంతో రోజువారి పనులకు వెళ్లే కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు గజగజ వణుకుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు చలితీవ్రత ఎక్కువగా ఉంటోంది. ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు,పెదబయలు మార్గాల్లో మంచు దట్టంగా కురుస్తుండటంతో హెడ్‌లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తున్నారు..
డుంబ్రిగుడ: మండలంలోని మంచు దట్టంగా కురుస్తోంది. చలి తీవ్రత పెరిగడంతో స్థానికులు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు.
వణుకుతున్న మన్యం
వణుకుతున్న మన్యం


