అందని బిల్లులు.. అసంపూర్తి నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

అందని బిల్లులు.. అసంపూర్తి నిర్మాణాలు

Nov 27 2025 6:35 AM | Updated on Nov 27 2025 6:35 AM

అందని

అందని బిల్లులు.. అసంపూర్తి నిర్మాణాలు

పీఎంజన్‌మన్‌ పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణం పరిస్థితి అగమయ్యగోచరంగా మారింది. ఉన్న ఇళ్లను కూల్చివేసి ఎంతో ఆశగా కొత్త ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన లబ్ధిదారులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో ఏం చేయాలో తోచక అయోమయంలో పడ్డారు. చాలా ఇళ్లు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.

ముంచంగిపుట్టు: మండలంలో 23 పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వం పీవీటీజీ గిరిజనులకు ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌(పీఎంజన్‌మన్‌) పథకం ద్వారా 4,731 పక్కా ఇళ్లు మంజూరు చేసింది. వాటిలో 4,405 ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్‌ అధికారులు చర్యలు తీసుకున్నారు. గృహాలు మంజూరు కావడంతో ఎంతో ఆనందంగా నిర్మాణాలు ప్రారంభించారు. ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. మొదటి విడతలో రూ. 70వేల చొప్పున పునాదుల స్థాయి నిర్మాణానికి నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు.ఇంత వరకు బాగానే ఉన్నా తరువాత బిల్లుల మంజూరు కాక పోవడంతో లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. లింటల్‌ స్థాయి వరకు పూర్తి చేస్తే రూ.90వేలు,పైకప్పు పూర్తయితే రూ.40 వేలు చెల్లించాల్సి ఉంది. మరో రూ.27వేలు గ్రామీణ జాతీయ ఉపాధీ హామీ పథకం కింద చెల్లించాల్సి ఉంది.వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే మరో రూ.12వేలు మంజూరు అవుతుంది.

రెండు నెలలుగా విడుదల కాని నిధులు

మండలంలో 23 పంచాయతీల్లో నిర్మించిన గృహాలకు రెండు నెలలుగా నిధులు విడుదల కాలేదు. సుమారుగా 3 కోట్లకు పైగా బకాయిలు విడుదల కావాల్సి ఉంది.వివిధ స్థాయిలో ఉన్న 4,405 గృహాలకు బిల్లులు మంజూరు కావాలి. ముఖ్యంగా కుమడ, బాబుశాల, బరడ, బంగారుమెట్ట, రంగబయలు, వనుగుమ్మ, లక్ష్మీపురం పంచాయతీల్లో అధికంగా బిల్లులబకాయిలు ఉన్నాయి. రూప్‌ లెవెల్‌ స్థాయి వరకు నిర్మించిన 2,448 గృహాలకు బిల్లులు అందలేదు. గతంలో ఉన్న ఇళ్లను తొలగించి, నూతన ఇళ్లు నిర్మాణాలు ప్రారంభిస్తే బిల్లులు మంజూరు కాక, ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగక పీవీటీజీ గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాకలు వేసుకుని నివాసముంటున్నారు. ప్రస్తుతం చలి తీవ్రతతో పాటు మంచు ప్రభావం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చలికి వణుకుతూ పిల్లలు, వృద్ధులు నరకయాతన పడుతున్నారు. గృహాల నిర్మాణాల బకాయిలపై గిరిజన సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించి, ఆందోళనలు చేసినా స్పందన కరవైంది. తక్షణమే బకాయిలు విడుదల చేయాలని లబ్ధిదారులు మొర పెట్టుకుంటున్నారు.

చిన్నపాకలో ఉంటున్నాం

కొత్త గృహం మంజూరు కావడంతో ఉన్న ఇంటిని తీసేసి నిర్మాణ పనులు మొదలు పెట్టాను.మొదటి బిల్లు మాత్రమే జమ అయింది.రెండు విడతల బిల్లులు ఇంకా రాలేదు.రెండు నెలలుగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం చిన్నపాక వేసుకునే ఉంటున్నాను. చలి,మంచుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం తక్షణమే బకాయి సొమ్ము చెల్లిస్తే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొనే అవకాశం ఉంటుంది.మా బాధలు అర్థం చేసుకుని బకాయిలు విడుదల చేయాలి..

– కిల్లో లక్ష్మణ్‌,

దొరగూడ, ముంచంగిపుట్టు మండలం

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

పీఎం జన్‌మన్‌ కింద మంజూరు చేసిన, వివిధ స్థాయిల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కొంత మేర నిధులు లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాలో జమ అయ్యాయి. ప్రసుత్తం నిలిచిన బిల్లుల చెల్లింపులపై ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకొని వెళ్లాం. త్వరలోనే నిధులు విడుదలై గృహ లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాలో జమ అవుతాయి. బిల్లులు మంజూరైన వెంటనే సకాలంలో ఇళ్లనిర్మాణాలు పూర్తి చేయాలి.

– సీహెచ్‌.కృష్ణారావు,

ఏఈ, హౌసింగ్‌శాఖ, ముంచంగిపుట్టు.

బకాయిలు చెల్లించాలి

ముంచంగిపుట్టు మండలంలో రూ.3 కోట్లపైగా గృహాల బకాయిలు ఉన్నాయి. గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించాం నేటికీ బకాయిలపై ఎటువంటి స్పందన లేకపోవడం దారుణం. ఉన్న ఇంటిని తొలగించి,కొత్త ఇల్లు పూర్తికాక పీవీటీజీ గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే హౌసింగ్‌ బకాయిలు విడుదల చేయాలి. – కె.త్రినాథ్‌, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యాక్షుడు, ముంచంగిపుట్టు

సకాలంలో బిల్లులందక అయోమంలో లబ్ధిదారులు

ముంచంగిపుట్టు మండలంలో

రూ.3 కోట్లకు పైగా బకాయిలు

బకాయిలు విడుదల చేయాలని

గృహ లబ్ధిదారులు మొరా

అందని బిల్లులు.. అసంపూర్తి నిర్మాణాలు1
1/2

అందని బిల్లులు.. అసంపూర్తి నిర్మాణాలు

అందని బిల్లులు.. అసంపూర్తి నిర్మాణాలు2
2/2

అందని బిల్లులు.. అసంపూర్తి నిర్మాణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement