నల్లరాయి క్వారీల తనిఖీ
జి.మాడుగుల: మండలంలో సింగర్భ పంచాయతీ జి.నిట్టాపుట్టు ప్రాంతంలో ఉన్న పాత క్వారీతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న నల్లరాయి క్వారీని బుధవారం జిల్లా గనుల, భూగర్భ శాఖ అధికారి ఎం.ఆనంద్, విజయనగరం ప్రాంతీయ నిఘా విభాగం అసిస్టెంట్ జియాలజిస్టు ఎస్.పి.కె మల్లేశ్వరరావు, వీఆర్వో వి.సింహాచలం తనిఖీ చేశారు. ముందుగా క్వారీలకు సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించారు. రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయని చెప్పారు. ఇటీవల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. రికార్డుల్లో పొందిపరిచినట్టుగా మెటీరియల్ అంతా గిరిజన ప్రాంత రహదారులు అభివృద్ధికి వినియోగించినట్టు తేలిందని చెప్పారు. 2021సంవత్సరం నుంచి పాత క్వారీ పూర్తిగా మూసివేసినట్టుగా అధికారులు నిర్థారించారు. పాత క్వారీకి, ప్రస్తుతం కొత్త క్వారీకి ఎటువంటి సంబంధం లేదని, దూరంగా ఉన్న వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన 1.63హెక్టార్లుల్లో నిర్ణయించిన పరిమితి మేరకు పనులు జరుగుతున్నాయని వారు తెలిపారు.


