అభివృద్ధి పనులకు పక్కాగా అంచనాలు
మహారాణిపేట: అభివృద్ధి పనులు చేపట్టే క్రమంలో అంచనాలు పక్కాగా రూపొందించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులను సమర్థంగా వినియోగించాలని రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కమిటీ సభ్యు లు ఏలూరి సాంబశివరావు, నిమ్మక జయ కృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, పి.సూర్యనారాయణరాజు, వరుదు కల్యాణిలతో కలిసి బుధవారం విశాఖలో పర్యటించిన ఆయన, కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. 2019– 20, 2020– 21, 2021–22 ఆర్థిక సంవత్సరాల్లో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు, రూపొందించిన అంచనాలు, వ్య యం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముందుగా జిల్లాలోని ప్ర స్తుత స్థితిగతులను, చేపట్టిన ప్రాజెక్టులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, ఆయా విభాగాల అధికారులు కమిటీకి వివరించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ.. అంచనాలు రూపొందించే సమయంలోనే జా గ్రత్తగా ఉంటే, పను లు చేపట్టే సమయంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని, పైగా, ప్రక్రియలు సులభంగా జరిగిపోతాయని పేర్కొన్నారు. మేహాద్రి గెడ్డ రిజర్వాయర్ మరమ్మతులు చేపట్టి, జీవీఎంసీకి అప్పగించేందుకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
కేజీహెచ్‌లో జనరేటర్లు లేవా?
కేజీహెచ్‌లో ఇటీవల విద్యుత్ అంతరాయం ఎందుకు ఏర్పడింది? అక్కడ సరిపడా జనరేటర్లు లేవా? అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అధికారులను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. కొత్తగా నిర్మిస్తున్న భవనానికి వాటర్ పైపు వేసే క్రమంలో భూగర్భ విద్యుత్ తీగలు తెగాయని, కొంత సమయం తర్వాత పునరుద్ధరణ చర్యలు చేపట్టామని తెలిపారు. జనరేటర్లు సరిపడా ఉన్నాయని కేజీహెచ్ అధికారులు వివరించారు. సివిల్ సర్జన్ అసిస్టెంట్ల నియామకాలు చేపట్టాలని, అలాగే క్యాన్సర్ తీవ్రత పెరుగుతున్న క్రమంలో విశాఖ కేంద్రంగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో అమలు చేస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలని సభ్యుడు ఏలూరి సాంబశివరావు అన్నారు. ప్రతి నెలా ఒకటో తారీఖున పింఛన్ల పంపిణీలో సచివాలయ, డీఆర్డీఏ ఉద్యోగులతో పాటు ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలను కూడా భాగస్వామ్యమైతే బాగుంటుందని మద్దిపాటి వెంకటపతి రాజు అభిప్రాయపడ్డారు. వ్యవసాయ సంబంధిత ఫలాలు రైతులకు వేగంగా అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని, అలాగే వినూత్నమైన పథకాల ప్రయోజనాలను రైతులకు వివరించాలని నిమ్మక జయకృష్ణ సూచించారు.
మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ను
జీవీఎంసీకి అప్పగించాలి
‘మేహాద్రి గెడ్డ రిజర్వాయర్ ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఉంది. అయితే దాని కింద ఆయకట్టు అంతగా లేదు. ఈ రిజర్వాయర్‌ను జీవీఎంసీ పరిధిలోని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నాం.’అని కలెక్టర్ హరేందిర ప్రసాద్ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. దీని నిర్వహణ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, మరమ్మతులు చేపట్టేందుకు తగిన నిధులు ఇవ్వాలని, తదనంతరం రిజర్వాయర్‌ను తాగునీటి అవసరాలకు పూర్తిగా వినియోగించుకునేలా అనుమతించాలని కోరుతూ ప్రభుత్వానికి కమిటీ నివేదించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఏపీ శాసన సభ డిప్యూటీ సెక్రటరీ రాజ్ కుమార్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఆర్డీవో సుధాసాగర్, వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రమేష్ బాబు, సీఈ వినయ్ కుమార్, జీవీఎంసీ ఏడీసీ వర్మ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు, ఇతర సభ్యులతో కలిసి కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జేసీ కె. మయూర్ అశోక్ సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఆర్డీవో సుధాసాగర్ రాజ్యాంగ పీఠికను చదివారు. కలెక్టరేట్ ఏవో బి.వి.రాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చందనోత్సవం ఘటన పునరావృతం కారాదు
సింహాచలం దేవస్థానంలో అంచనాల కమిటీ సమీక్ష
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో గడచిన చందనోత్సవాన జరిగిన ప్రమాద సంఘటన దురదృష్టకరమని, అలాంటి ఘటన పునరావృతం కాకుండా పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని రాష్ట్ర అంచనాల కమిటీ సూచించింది. దేవస్థానాన్ని అంచనాల కమిటీ బుధవారం సందర్శించింది. కమిటి చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు, సభ్యులు నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, డాక్టర్ పెనుమత్స వి.వి.సూర్యనారాయణరాజు, ఏలూరి సాంబశివరావులు పాల్గొని దేవస్థానం అభివృద్ధి, ఆర్థిక వ్యయ అంచనాలు తదితర అంశాలపై సమీక్ష జరిపారు. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్ల ప్రణాళికలు చేసుకోవాలన్నారు. దేవస్థానం భూసమస్య హైకోర్టులో పెండింగ్‌లోఉందన్నారు. దర్శనార్థం వచ్చిన కమిటీ చెర్మన్, సభ్యులు ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో వీరి పేరిట ప్రత్యేక పూజలు జరిపి, వేద ఆశీర్వచనమిచ్చారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపికలను ఈవో సుజాత అందించారు.


