పాపం..పసివాళ్లు
తల్లుల కళ్ల ముందే శిశువులు అంతుపట్టని వ్యాధితో ప్రాణాలు విడుస్తుంటే వారి వేదన వర్ణణాతీతం. దార్రెల పంచాయతీలో నెలరోజుల్లో ఐదుగురు శిశువులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకొని నవ మాసాలు మోసి కంటే కొన్ని నెలలకే నూరేళ్లు నిండిపోవడం కన్న పేగుకు కడుపు కోత మిగులుస్తోంది. ఊపిరాడక చనిపోతున్నారని బాధిత తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనిపై వైద్య నిపుణులు లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.
ఇద్దరు శిశువుల మృతితో తీవ్ర విషాదంలో తలింబ గ్రామం
శిశు మరణాలపై ఆందోళన చెందుతున్న డి.కుమ్మరిపుట్టు గ్రామ గిరిజనులు
ముంచంగిపుట్టు: దార్రెల పంచాయతీలోని గ్రామాల్లో శిశువులు ఊపిరాడక మృతి చెందడంతో విషాదఛాయలు నెలకొన్నాయి. శ్వాస సంబంధిత సమస్య వచ్చిన వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్య సేవలు అందిస్తున్న తరుణంలో పసికందులు కన్నుమూస్తున్నారు. చిన్నారులు ఇలా వరుసగా ప్రాణాలు విడుస్తుండటంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలోకి వెళ్తున్నారు. నెలరోజుల వ్యవధిలో ఐదుగురు మృతి చెందగా వీరిలో ఇద్దరు మొదటి కాన్పు కావడంతో బాధిత కుటుంబాలను ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదు. శ్వాస సంబంధిత సమస్యలకు తగిన వైద్య సదుపాయాలు ఆసుపత్రుల్లో లేకపోవడం వల్ల మరణాలకు దారితీస్తున్నాయని బాధిత కుటుంబాల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. వీటిపై లోతుగా అధ్యయనం చేసి, రానున్న రోజుల్లో శిశు మరణాలు జరగకుండాపూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని దార్రెల పంచాయతీలోని డి.కుమ్మరిపుట్టు, తలింబ, చీవుకుచింత గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.
శిశు మరణాలపై విచారణ
దార్రెల పంచాయతీలోని శిశు మరణాలపై విచారణ నిర్వహిస్తున్నాం.ఆదివారం ఆయా గ్రామాల్లో చిన్న పిల్లల వైద్యులతో కూడిన రెండు వైద్య బృందాలను / క్షేత్రస్థాయి పరిశీలనకు పంపించాం. శిశువుల తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. సోమవారం పూర్తిస్థాయి వివరాలు వెల్లడిస్తాం. – డాక్టర్ డి.కృష్ణమూర్తినాయక్,
డీఎంహెచ్‌వో, పాడేరు
దార్రెల పంచాయతీలో వరుస
శిశు మరణాలు
నెలరోజుల్లో ఐదుగురి మృతితో ఆందోళన
శ్వాస సంబంధిత సమస్యలతో
చనిపోతున్నారని బాధిత కుటుంబాల ఆవేదన
ఆందోళన చెందుతున్న గిరిజనులు
ప్రభుత్వాస్పత్రుల్లో సక్రమంగా వైద్యం అందడం లేదని పలువురి ఆరోపణ
పాపం..పసివాళ్లు


