సమాన పనికి సమాన వేతనం
● సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు
ఏవీ నాగేశ్వరరావు డిమాండ్
● రంపచోడవరంలో సంఘ మహాసభలు ప్రారంభం
రంపచోడవరం: రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు చెల్లించడమే కాకుండా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రంపచోడవరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభమైన జిల్లా మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. రంపచోడవరం పురవీధుల్లో నిర్వహించిన ర్యాలీలో కార్మికులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఐటీయూ నాయకులు పాల్గొని ప్రసంగించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన లేబర్ కోర్టులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ కనీస వేతన విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. దీనివల్ల కార్మికులకు ప్రతీ రోజు రూ. 180 వేతనం అందుతుందన్నారు.పని గంటలను 8 నుంచి 13కు పెంచేందుకు ప్రయత్నిస్తుందని దీని వల్ల పెట్టుబడిదారులకు లాభం చేకూరుతుందన్నారు. ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొప్పెన కిరణ్ మాట్లాడుతూ ఏజెన్సీలో పర్యటించిన ఒడిశా సీఎం గతంలో గిరిజన మహిళలు నల్లగా ఉంటారని వారిని కించపరిచే విధంగా మాట్లాడారన్నారు. అటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ప్యటించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అలాగే హైడ్రో ప్రాజెక్టు పేరుతో పాడేరు, అరకు ప్రాంతంలోని విలువైన ఖనిజ సంపదలను కార్పొరేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దీనిని సమష్టిగా తిప్పికొట్టాలన్నారు. వివిధ రంగాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని,రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే వేతనాలే కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ, మిడ్ డే మీల్స్ వర్కర్లను, కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలపై విద్యుత్ చార్జీ భారాన్ని మోపుతున్నాయన్నారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారని ఇప్పుడు ఆయనే స్మార్ట్ మీటర్లును బిగించాలని అధికారులను ఆదేశిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్, జిల్లా అధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ, పి సంతోష్ , నిర్మల పి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


