మహారాణిపేట: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం జీటీడబ్ల్యూఏ స్కూల్లో బర్త్‌డే కేక్ తిని, అస్వస్థతకు గురైన ఇద్దరు విద్యార్థినులను ఆదివారం కేజీహెచ్‌లో చేర్చారు. వివరాలిలా ఉన్నాయి.. శనివారం రాత్రి పాఠశాలలో విద్యార్థిని ప్రసన్నకీర్తి(15) జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కేక్‌ను 8, 9, 10 తరగతి విద్యార్థులు తిన్నారు. కొద్దిసేపటి తర్వాత కొంత మంది విద్యార్థులకు విరేచనాలు మొదలయ్యాయి. అనంతరం వాంతులయ్యాయి. ఇందులో ఇద్దరికి వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రసన్న కీర్తి(15), హాసిని(11)కి వైద్యులు వైద్యం అందించారు. ఆ తర్వాత ప్రసన్నకీర్తిని రాజేంద్ర ప్రసాద్ వార్డు, హాసినిని పిల్లల వార్డులో చేర్చి, వైద్య సేవలు అందిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు పలు వైద్య పరీక్షలు చేస్తున్నామని, ప్రమాదం లేదని, త్వరలో కొలుకుంటే ఇంటికి పంపుతామని వైద్యులు చెబుతున్నారు.
కేక్ తిన్నాను.. అంతే..
నా పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశాం. నాతోపాటు 8, 9, 10 తరగతుల విద్యార్థులు 100 మంది వరకు తిన్నారు. కొంత మంది అస్వస్థతకు గురయ్యారు. ముందు వికారం, తర్వాత విరేచనాలయ్యాయి. ఆ తర్వాత వాంతులు వచ్చాయి. నాకు విపరీతమైన నీరసం, జ్వరం వచ్చింది. దీంతో కొయ్యూరు ఆస్పత్రిలో వైద్యం అందించారు. ఆ తర్వాత కేజీహెచ్‌కు తీసుకొచ్చినట్లు మా అమ్మ ఆదిలక్ష్మి చెప్పింది. – కీర్తి ప్రసన్న, 10వ తరగతి
అస్వస్థతకు గురైన విద్యార్థినులకు చికిత్స


