విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
● భార్య సంస్మరణ దినం కార్యక్రమాల్లో అపశ్రుతి
● గుండాలకాలనీలో విషాదం
ఎటపాక: భార్య సంస్మరణ దినం (దశదిన ఖర్మకాండల) ఏర్పాటు పనుల్లో భర్త విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన విషాద ఘటన ఆదివారం ఎటపాక మండలం గుండాలకాలనీ గ్రామంలో జరిగింది. విద్యుత్‌శాఖ, పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాసిబోయిన వెంకటేశ్వర్లు(56) భార్య సుబ్బలక్ష్మి ఈనెల 12న అనారోగ్యంతో మృతిచెందింది. అయితే ఈనెల 24న ఇంటివద్ద జరుగనున్న దశదిన ఖర్మకాండల కోసం ఇంటి ప్రాంగణంలో శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో తన ఇంటి విద్యుత్ వైరు వేలాడుతుండడంతో, సరిచేయాలనుకున్నాడు. ఆ ప్రాంతంలో 11కేవి, 33కేవి విద్యుత్ వైర్లు , ఫైబర్‌నెట్ తీగలున్నాయి. అయితే సర్వీస్ వైర్‌ను ఫైబర్‌నెట్ వైరుకు కలిపి కట్టాలని అనుకుని వేరే విద్యుత్ వైరును సగ భాగం చేతితో పట్టుకుని మిగతా భాగాన్ని ఫైబర్‌నెట్ వైరు పైకి విసిరాడు. ఆ సమయంలో తన చేతితో పట్టుకున్న వైరు పైన ఉన్న 33కేవి వైరుకు తాకడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు చాతి, కాళ్లు, చేతులు కాలి గాయాలు కాగా అక్కడికక్కడే కుప్పకూలాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే వెంకటేశ్వర్లు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. మృతుడి కుమారుడు ప్రసాద్ ఫిర్యాదుతో ఎటపాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్య సంస్మరణ దినం జరపకుండానే భర్తను మృత్యువు కభలించడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి


