ఎట్టకేలకు బస్ సర్వీసు పునరుద్ధరణ
సీలేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి సీలేరు మీదుగా తెలంగాణ రాష్ట్రం భద్రాచలం వెళ్లే ముంపు మండలాల బస్సు సర్వీసును ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు పునరుద్ధరణ చేపట్టారు. ఈ మేరకు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాస్ ప్రకటన చేశారు. జిల్లాల విభజన తర్వాత తెలంగాణ సరిహద్దు ముంపు మండలాల ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని జిల్లా కేంద్రానికి వచ్చేందుకు వీలుగా పాడేరు నుంచి సీలేరు మీదుగా భద్రాచలానికి బస్ సర్వీసును ఏర్పాటు చేసి నడిపించారు. ఫ్రీ బస్సు పథకం ప్రారంభం పది రోజులకే ఈ బస్సును నిలిపివేశారు. అప్పటి నుంచి ఈ బస్సు సర్వీసును కొనసాగించాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు. దీనిపై ‘సాక్షి’లో ఈనెల మూడో తేదీన ‘ఉచిత బస్సు ప్రయాణం దూరం’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. దీంతో ఆర్టీసీ అధికారులు స్పందించి ఈనెల ఏడో తేదీ నుంచి ఈ బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అయితే గతంలో టైమింగ్ కాకుండా పాడేరులో మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి సీలేరు రాత్రి 8 గంటలకు వచ్చి భోజనం అనంతరం భద్రాచలం రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు పాడేరు చేరుకునే విధంగా టైమింగ్ మారుస్తూ బస్సును ప్రారంభించనున్నారు. రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు సీలేరు ఏటిపి ఏజెంట్ తరుణ్ తెలిపారు. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికుల హర్షం
ఎట్టకేలకు బస్ సర్వీసు పునరుద్ధరణ


