సికిల్‌సెల్ ఎనీమియా పరీక్షలు తప్పనిసరి
పాడేరు : అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 40 ఏళ్లలోపు వారికి కచ్చితంగా సికిల్‌సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్ ఆ శాఖ ఉద్యోగులను ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయం నుంచి వైద్యారోగ్య శాఖ ఆరోగ్య పర్యవేక్షకులు, ఏఎన్‌ఎంలతో సికిల్‌సెల్ ఎనీమియా, వైద్యారోగ్య శాఖ సేవలపై సమీక్ష నిర్వహించారు. వ్యాధి నిర్థారణ అయితే తగిన చికిత్స అందించాలని తెలిపారు. జిల్లాలో 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటి వరకు 4,72,950 మందికి సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 13,903 మందికి సికిల్ సెల్ ట్రైట్ రాగా, మరో 1,582 మందికి వ్యాధి నిర్ధారణ అయిందన్నారు. సికిల్‌సెల్ ఎనీమియా రోగులకు పౌష్టికాహారం అందించేందుకు నెలకు రూ.10వేల పింఛన్ ఇస్తున్నామని చెప్పారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ సికిల్‌సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు జరిపి, వ్యాధి నిర్ధారణ అయితే పాడేరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్చి వైద్య సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌వో డాక్టర్ టి.ప్రతాప్, జిల్లా ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, సికిల్ సెల్ ఎనీమియా జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ కె. బాబ్జీ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సీహెచ్. కమల కుమారి పాల్గొన్నారు.


