అర్హులందరికీ అన్నదాత సుఖీభవ
కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు: అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, మండల సర్వే అధికారులు, గ్రామ రెవెన్యూ, సర్వే, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల లబ్ధిపొందడానికి సంబంధిత పత్రాలు అందజేయడంలో ఆలస్యం కాకూడదన్నారు. రీసర్వే ప్రక్రియలో గ్రామం సరిహద్దుల్లో భూములున్న సంబంధిత శాఖలకు నోటీసులు ఇవ్వాలని, గ్రామాల్లో ఉన్న అటవీ, రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఆన్‌లైన్‌లో టెక్నికల్ సమస్యలు ఉంటే కలెక్టరేట్ ఈడీఎంకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. స్మార్ట్ కార్డుల పంపిణీలో జాప్యం చేయవద్దన్నారు. జిల్లాలోని డిపోలన్నింటినీ ఆన్‌లైన్ చేయాలని, వృద్ధులకు ఇంటి వద్దే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు రేషన్ డిపోలు తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, డీఆర్వో పద్మాలత, రీసర్వే ఏడీ దేవేంద్రుడు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి.మోహన్ తదితరులు పాల్గొన్నారు.


