సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
రంపచోడవరం: ఏజెన్సీలో గిరిజనులు అభివృద్ధి చెందాలంటే అనేక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రదర్శన నిర్వహించారు. స్ధానిక ఏఐకెఎంఎస్ భవనం నుంచి అంబేడ్కర్ సెంటర్ మీదుగా ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. పలు డిమాండ్లుతో కూడిన వినతిపత్రాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్‌కు అందజేశారు. ఏజెన్సీలో ఆదివాసీలు సాగులో ఉన్న అన్ని రకాల భూములకు శాశ్వత పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రంపచోడవరం ప్రత్యేక ఆదివాసీ జిల్లా చేయాలని, ఏజెన్సీలో బ్రాందీ, బెల్టు షాపులు, సారా తయారీ వంటి మత్తు పానీయలపై ఉక్కుపాదం మోపాలన్నారు. 1/70 చట్టం , అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం అమలు చేయాలన్నారు. ఏజెన్సీలో ప్రత్యేక జీవో తీసుకువచ్చి నూరుశాతం ఉద్యోగాలు గిరిజనులకు కల్పించాలన్నారు. రంపచోడవరం డివిజన్ కేంధ్రంలో ఆర్‌టీసీ డిపో ఏర్పాటు చేయాలన్నారు. 2016–17 మధ్య నిర్మించిన ఇళ్లకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, జీడిమామిడి రైతులకు బీమా గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. పాపికొండలు అభయరణ్యం రద్దు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. నాయకులు లచ్చిరెడ్డి, దూలయ్య, బాలురెడ్డి, అశోక్, అక్కిసా తదితరులు పాల్గొన్నారు.


