పాఠశాలల్లో పారిశుధ్య పనులు తప్పనిసరి
రంపచోడవరం: ఏజెన్సీలోని అన్ని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, నిర్లక్ష్యం చేయవద్దని రంపచోడవరం ఐటీడీఏ పీవో బి స్మరణ్‌రాజ్ అన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలు నుంచి సోమవారం డీడీ రుక్మాండయ్య, ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు, ఏడీఎంహెచ్‌ఓ సరితతో కలిసి వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. పీవో స్మరణ్‌రాజ్ మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం ద్వారా దోమలను నివారించాలన్నారు. పాఠశాలల ప్రాంగణంలో ఫాగింగ్ చేయించాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్దాల నాణ్యతను పరిశీలించి నివేదికలు సమర్పించాలని అధికారులను అదేశించారు. అలాగే విద్యార్థులు తాగే నీటిని పరీక్ష చేయించి నివేదికలు ఇవ్వాలని సూచించారు. ఎంపీడీఓలు పాఠశాలలను సందర్శించి అక్కడ పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగిలో విలీనమైన పాఠశాలలకు గ్రామసభకు నిర్వహించి నివేదికలు సమర్పించాలన్నారు. మండలాల వారీగా దత్తత తీసుకున్న పాఠశాలల వివరాలపై ఆరా తీశారు. సమావేశంలో ఎంపీడీఓ శెట్టి రాజు, సాల్మన్‌రాజు,కుమార్ ,యాదగిరి, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


