సమ్మె సైరన్
ఏపీఎఫ్‌డీసీలో పనిచేస్తున్న కాఫీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. కనీస వేతనం అమలుచేయకపోవడంతో దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. యాజమాన్యం తీరుతో విసిగిపోయిన వారు ఈనెల 6వ తేదీలోగా న్యాయసమ్మతమైన తమ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని నోటీసులు ఇచ్చారు.
కాఫీ
కార్మికుల
సాక్షి,పాడేరు/చింతపల్లి: ప్రభుత్వం ఆధీనంలోని ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ)లో పనిచేస్తున్న కాఫీ కార్మికులు వెట్టిచాకిరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు కాఫీతోటల్లో కష్టపడుతున్నా కనీస వేతనాలు అమలుకావడం లేదని వారు ధ్వజమెత్తుతున్నారు. రోజుకు రూ.320 కూలి అమలుజేస్తుండడంతో కష్టానికి తగ్గ ఫలితం లేదని వారు వాపోతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి రోజు వారి కూలి రూ.400కు పెంచుతామని అప్పట్లో ఏపీఎఫ్‌డీసీ అధికారులు హమీ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయిందని వారు విమర్శిస్తున్నారు.
● ఏజెన్సీలోని పాడేరు మండలం మినుములూరు. అనంతగిరి,పెదబయలు మండలం చుట్టుమెట్ట,చింతపల్లి మండలం వంగసార, గూడెంకొత్తవీధి మండలం ఆర్‌వీనగర్, లంకపాకలు, పెద్దగెడ్డ తదితర ప్రాంతాల్లో ఏపీఎఫ్‌డీసీకి చెందిన రూ.10వేల ఎకరాల్లో కాఫీతోటలు ఉన్నాయి. వీటిలో సుమారు రెండు వేల మంది కార్మికులు రోజువారీ కూలిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీఇరికి కనీస వేతన చట్టం అమలు చేయకపోగా 2024 అక్టోబర్‌లో కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీఎఫ్‌డీసీ పెంచిన రోజు వారి కూలి రూ.400 కూడా ఇవ్వకపోవడంతో వారు ఉసూరుమంటున్నారు.
● ఏపీఎఫ్‌డీసీ కాఫీ కార్మికుల నివాస గృహాల్లో కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. మినుములూరుతో పాటు అన్ని ప్రాంతాల్లో పూర్వం నిర్మించిన పెంకు, రేకుల నివాస గృహాలు శిథిలావస్థకు చేరాయి. వీటిలో బిక్కుబిక్కుమంటూ దుర్భర జీవనం సాగిస్తున్నారు.
● కాఫీ కార్మికులంతా సీఐటీయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏపీఎఫ్‌డీసీ అధికారులకు గత 20 రోజుల నుంచి సమ్మె నోటీసులు ఇస్తున్నారు. పాడేరు, చింతపల్లి డీఎంలను కార్మికులంతా కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు, సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం, అధికారుల దృష్టికి తమ న్యాయ సమ్మతమైన సమస్యలను పరిష్కరించాలని తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కాఫీ కార్మికులు అగ్రహంతో ఉన్నారు.
డిమాండ్లు ఇవే..
కాఫీ కార్మికులకు వేజ్ రేటు ప్రకారం కూలి, పండ్ల సేకరణ ధరలు పెంచాలి. నెలకు 26రోజుల పనిదినాలు కల్పించాచడమే కాకుండా హెల్పర్లకు పదోన్నతులు కల్పించి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి, ప్లాంటేషన్ కండక్టర్లను నియమించి, హెల్పర్లందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. టీఏ,డీఏలతో పాటు వారాంతపు చెల్లింపులు జరపాలి. నివాస గృహాలకు మరమ్మతులు చేపట్టాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడమే కాకుండా తోటల్లో ప్రమాదాలు జరిగితే వైద్య ఖర్చులు సంస్థ భరించాలి. కూలి పనులు చేసే వారందరికి పండగ దినాల్లో ప్రీమస్తర్లు అమలుజేయాలి.
కనీస వేతనం అమలు చేయకుండా
వెట్టి చాకిరీ
యాజమాన్యాన్ని పలు దఫాలు
ఆశ్రయించినా ఫలితం శూన్యం
ఈనెల 6వతేదీలోగా
పరిష్కరించకుంటే విధులకు దూరం
ఏపీఎఫ్‌డీసీకి స్పష్టీకరణ
కాఫీ పండ్ల సేకరణ
పనులపై చూపనున్న ప్రభావం
సమ్మె సైరన్


