భవనం ప్రారంభమెన్నడో?
● పూర్తయిన గురుకుల పాఠశాల
● పరిశీలించని అధికారులు
● విద్యార్థులకు తప్పని వసతి సమస్య
సీలేరు: గూడెం కొత్తవీధి మండలంలోని సీలేరులో గురుకుల పాఠశాల భవనం పూర్తయినా అధికారుల నిర్లక్ష్యంతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో విద్యార్థులు వసతి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. భవనం నిర్మాణం పూర్తయి అయిదు నెలలు కావస్తున్నా ప్రారంభించలేదని పలువురు చెబుతున్నారు. నెలలు గడుస్తున్నా భవనం నాణ్యత ప్రమాణాల పరిశీలన మంజూరు తదితర అంశాలు పరిశీలనలో అధికారులు తాత్సారం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గురుకుల పాఠశాలలో 405 మంది విద్యార్థులున్నారని, ప్రస్తుతం ఆయా విద్యార్థులు సమీపంలోని ఉన్న భవనంలో ఉంటున్నారని, వసతి సమస్యతో సతమతమవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పూర్తయిన గురుకుల పాఠశాల భవనాన్ని త్వరితగతిన అందుబాటులో తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


