వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం
● సిబ్బందికి డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్ ఆదేశం
● ఈదులపాలెం పీహెచ్‌సీ తనిఖీ
పాడేరు రూరల్: తుపాను వల్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్ ఆదేశించారు. ఈదులపాలెం పీహెచ్‌సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుపట్టిక, రిజిస్టర్లను పరిశీలించారు. ల్యాబ్ టెక్నీషియన్ విధుల్లో లేకపోవడంతో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆరోగ్య పర్యవేక్షకురాలు డిప్యుటేషన్‌ను రద్దు చేసి తిరిగి రప్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. విధులు పట్ల ఎవరు నిర్లక్ష్యం చేసినా ఉపేక్షించేది లేదన్నారు. గర్భిణులతో మాట్లాడారు. అందుతున్న వైద్యసేవల వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు సకాలంలో నిర్వహించి అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. మలేరియా, డయేరియా,టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కుష్టు, ఎయిడ్స్‌నియంత్రణ అధికారి కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.


