రైతులకు సూచనలు
చింతపల్లి: మోంథా తుపాను నేపథ్యంలో బుధవారం ఆచార్య ఎన్‌జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయ శాఖాధికారులు చిన్నగెడ్డ, చింతబారు, లోతుగెడ్డ, జంక్షన్, సంకాడ గ్రామాల్లో బుధవారం పర్యటించారు. గ్రామాల్లో వరి, రాజ్‌మా ,చిక్కుళ్ల పంటలను పరిశీలించారు. పొలంలో నీటిని అంతర్గత కాలువల ద్వారా బయటకు పంపాలని, ఎక్కువగా నీరు నిలిస్తే పెద్దకాలువలు చేసి మోటార్ల ద్వారా నీటిని తరలించాలని, గింజలు రంగుమారితే 200మిల్లీ లీటర్ల ప్రోపికోన్‌జోల్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. నీట మునిగిన వరి పనలను ఐదు శాతం ఉప్పు ద్రావణం కలిపి పిచికారీ చేయాలన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్ చింతపల్లి ఏడీఆర్ అప్పలస్వామి, చింతపల్లి ఏడీఏ తిరుమలరావు, శాస్త్రవేత్త జోగారావు, ఏవోలు మదుసూధన్‌రావు, గిరిబాబు పాల్గొన్నారు.
రాజవొమ్మంగి: మండలంలో పత్తి, పొగాకు, వరి సాగు చేస్తున్న రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఏఓ చక్రధర్ సూచనలు చేశారు. ఆయన పలు గ్రామాల్లో బుధవారం పర్యటించి, పొలాల్లోకి చేరిన వరద నీటిని గండ్లు కొట్టి దిగువకు వదిలిపెట్టేయాలని సూచించారు. పంటలకు తెగుళ్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.


