జలాశయాలకు వరద తాకిడి
దేవరాపల్లి: మోంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పలు జలాశయాల్లోకి భారీగా వరదనీరు పోటెత్తుతోంది.
రైవాడ జలాశయానికి భారీగా నీరు రావడంతో నాలుగు గేట్లు తెరిచి 12వేల క్యూసెక్కులను శారదానదిలో బుధవారం విడుదల చేశారు. బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో 10వేల క్యూసెక్కుల ఉన్న ఇన్‌ఫ్లో, మధ్యాహ్నం 12 గంటల సమయానికి 11వేల క్యూసెక్కులు, ఒంటి గంట సమయానికి 12 క్యూసెక్కులుగా ఇన్‌ప్లో పెరుగుతూ వచ్చింది. అప్రమత్తమైన జలాశయం పర్యవేక్షణ డీఈ జి. సత్యంనాయుడు తదితర ఇంజనీరింగ్ అధికార్లు ఇన్‌ఫ్లో ఆధారంగా స్పిల్వే గేట్లు ద్వారా శారదానదిలోకి వరదనీటిని విడుదల చేస్తున్నారు. ఒక్కసారిగా 12వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండటంతో శారదానది ఉగ్రరూపం దాల్చింది. జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 112.97 మీటర్లకు చేరుకుంది.
పెద్దేరుకు పోట్టెత్తిన వరద
మాడుగుల: మండలంలో పెద్దేరు జలాశయంలోకి 1600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో అంతే నీటిని రెండు ప్రధాన గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దేరు పొంగి ప్రవహిస్తుండడంతో ఎల్.పొన్నవోలు, జేడీ పేట, సత్యవరం, జంపెన, వీరనారాయణం వీరవల్లి తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెద్దేరు జలాశయం గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 136.80 మీటర్లకు చేరుకుంది. జత్యవరం, జంపెన, గొటివాడ అగ్రహారం గ్రామాల వద్ద పెద్దేరుపై గల వంతెనల వద్ద సచివాయ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు సురక్షితంగా రాకపోకలు సాగిస్తున్నారు.
ప్రమాదస్థాయిలో కోనాం
చీడికాడ: మండలంలోని కోనాం జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరువైనట్టు ఇన్‌చార్జి ఏఈ సత్యనారాయణదొర తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా బుధవారం సాయంత్రానికి 99.10 మీటర్లకు చేరుకుంది. ఇన్‌ఫ్లో ఒక్కసారిగా 800 క్యూసెక్కులు పెరగడంతో సాయంత్రం నుంచి ప్రధాన గేట్ల ద్వారా దిగువకు700 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇన్‌ఫ్లోను బట్టి నీటి విడుదలను పెంచే అవకాశం ఉందన్నారు.
జలాశయాలకు వరద తాకిడి
జలాశయాలకు వరద తాకిడి


