బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
● ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాల్సిందే
● ప్రజలకు అండగా వైఎస్సార్‌సీపీ
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్
అరకులోయ టౌన్: మోంథా తుపానుకు పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ. 50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తుపాను బాధితులు అధైర్యపడొద్దని, నష్టపోయిన అన్నివర్గాలకు తమ పార్టీ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నష్టపరిహారం సకాలంలో అందించేందుకు పోరాడుతుందన్నారు. అరకులోయ నియోజకవర్గ పరిధిలో వరి, చోడి, తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. పంటలు నీట మునిగి రెండు రోజులు గడుస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం, వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచన వేయకపోవడం చాలా దారుణం అన్నారు. ఇప్పటికై నా నష్టపోయిన గిరి రైతులకు నేరుగా రూ. 50వేలు పరిహారం చెల్లించాలన్నారు. భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోయిన బాధితుల వివరాలు సేకరించి, మానవత దృక్పథంతో ఆలోచించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


