అప్పన్నకు నిత్యకల్యాణం
నిత్యకల్యాణంలో స్వామికి యజ్ఞోపవీతధారణ ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ బేడామండపంలో వేదికపై వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు.
కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.48.07 లక్షలు
డాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి దేవస్థానంలో బుధవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. గత ఆగస్టు 20 నుంచి ఈ నెల 29 వరకు హుండీల ద్వారా రూ.48,07,930 నగదు లభించింది. 61.510 గ్రాముల బంగారం, 941 గ్రాముల వెండి వచ్చింది. అలాగే 33 అమెరికా డాలర్లు, 2 సింగపూర్ డాలర్లు, యూఏఈకి చెందిన 10 ధీరమ్స్, సౌదీ అరేబియన్‌కు చెందిన 5 రియల్, ఒమన్‌కు చెందిన 1/2 రియల్, జర్మనీకి చెందిన 25 యూరోలతో పాటు పలు విదేశీ కరెన్సీ లభించింది. ఈ లెక్కింపులో ఈవో కె.శోభారాణి, జగన్నాథస్వామి ఈవో టి.రాజగోపాల్‌రెడ్డి, ఎస్‌బీఐ మేనేజర్ జె.నరసింహారావు, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, గోపాలపట్నం శ్రీహరిసేవ సభ్యులు పాల్గొన్నారు.


