తుపాను ప్రభావిత కుటుంబాలను ఆదుకోండి
అనంతగిరి (అరకులోయ టౌన్): మెంథా తుపాను ప్రభావిత గిరిజనులకు కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకుని అన్ని సౌకర్యాలు కల్పించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కోనాపురం పంచాయతీ చప్పాడి, వంట్లమామిడి గ్రామాల్లో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజతో కలిసి పర్యటించారు. వంట్లమామిగి గ్రామానికి చెందిన 15 కుటుంబాలు, చప్పడి గ్రామానికి చెందిన 45 కుటుంబాలను బొర్రా ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు తరలించి పునరావాసం కల్పించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొండచరియలు జారిపడుతున్న విషయాన్ని ఆయన పీవో దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న వారు ప్రభావిత ప్రాంతాల గిరిజనులను బొర్రా ప్రభుత్వ ఆశ్రమపాఠశాలకు తరలించారు. బొర్రా నుంచి కోనపురం వరకు రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని పీవోను గ్రామస్తులు కోరారు. త్వరలో సమస్య పరిష్కరిస్తామని వారికి పీవో హామీ ఇచ్చారు. ఎంపీటీసీ నవీన్, సర్పంచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే
రేగం మత్స్యలింగం డిమాండ్


