వరి రైతులూ.. అప్రమత్తత అవసరం
చింతపల్లి ఏడీఆర్ అప్పలస్వామి
చింతపల్లి: మోంథా తుపానుకు కురుస్తున్న వర్షాల పట్ల వరి రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ ఆళ్ల అప్పలస్వామి సూచించారు. మంగళవారం చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో వ్యవసాయశాఖ ఏడీ తిరుమలరావు, వ్యవసాయాధికారులతో కలిపి పర్యటించారు. దీనిలో భాగంగా చౌడుపల్లి, గాడిదలమెట్ట, చెరువూరు, రింతాడ, అసరాడ, ఏబులం గ్రామాల్లో వరి పైరును పరిశీలించారు. రైతులకు పలు సూచనలు చేశారు. వర్షాలకు పైరు నేలకొరిగిన సందర్భంలో అంతర్గత కాలువల ద్వారా పొలంలో వర్షం నీటిని తొలగించాలని సూచించారు. గింజలు రంగుమారడం, మాగుడు, మావిపండు తెగుళ్ల వ్యాప్తి నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటికి 200 ఎంఎల్ ప్రొపికొనజోల్ మందును నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు. గింజ గట్టిపడే దశలో పైరు అధిక వర్షాలకు గురైనా, నేలకొరిగిన కంకిలో మొలకలు కనపడినా 5శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాముల స్పటిక ఉప్పు లీటరు నీటికి) పిచికారి చేయాలని ఏడీఆర్ సూచించారు. మండల వ్యవసాయాధికారులు టి.మధుసూదనరావు, కె.గిరిబాబు, వీఏఏలు పాల్గొన్నారు.


