ముంపు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
● మట్టి గృహాల ప్రజలను సురక్షిత
ప్రాంతాలకు తరలింపు
● కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాలు
సాక్షి,పాడేరు: మోంథా తుపానుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముంపు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సహాయక చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అఽధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు ముంపు ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని, మట్టి ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రహదారులపై చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించాలని,రాత్రి సమయంలో రహదారి ప్రమాదాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలన్నారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. ప్రతి రెండు గంటలకు ఓ సారి సమాచారం అందజేయాలన్నారు. జనరేటర్లు, డీజిల్, విద్యుత్ స్తంభాలు, ఇసుక బస్తాలను అవసరమైన ప్రాంతాలకు తరలించాలన్నారు. నిత్యావసర సరుకులు పంపిణీకి చర్యలు తీసుకోవాలని, ట్యాంకులలో తాగునీటిని నింపి ఉంచాలని ఆదేశించారు.అన్ని ఆశ్రమ పాఠశాలలు,వసతి గృహాల్లో విద్యార్థులు బయటకు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.ఎస్పీ అమిత్‌బర్దర్ మాట్లాడుతూ మహిళా పోలీసులంతా సచివాలయాల్లో అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించినందున విద్యార్థుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
కంట్రోల్ రూమ్ తనిఖీ
కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన తుపాను కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ దినేష్‌కుమార్ తనిఖీ చేశారు.జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై సమీక్షించారు.కంట్రోల్ రూమ్‌లో అధికారులు, సిబ్బంది 24గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పుకార్లు నమ్మవద్దని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు,డీఆర్వో పద్మలత తదిత రులు పాల్గొన్నారు.


