ధారాలమ్మ ఘాట్ మూసివేత
సీలేరు: తుపాను నేపథ్యంలో ధారాలమ్మ ఘాట్ మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. ఏపీ జెన్‌కో చెక్ పోస్ట్ వద్ద మూసివేశారు. వాహన రాకపోకలు జరగకుండా ఎస్‌ఐ యాసిన్ చర్యలు చేపట్టారు. సీలేరు నుంచి గూడెం కొత్తవీధి వరకు ఉన్న సుమారు 50 కిలోమీటర్ల రహదారి ప్రస్తుతం ప్రమాదకరంగా ఉందని ఎస్‌ఐ తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడటమే కాకుండా చెట్లు కూలిపడే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘాట్ మార్గంలో రాకపోకలు నిలిపివేశామన్నారు. అత్యవసర వైద్యం అవసరమైన వారిని తమ సిబ్బంది సహకారంతో మైదాన ప్రాంతాలకు పంపిస్తామని ఎస్‌ఐ తెలిపారు.
ప్రమాదస్థాయికి బలిమెల
ఆంధ్రా ఒడిశా సరిహద్దు బలిమెల జలాశయ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో ఇరు రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. మొంథా తుపాను నేపథ్యంలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1516 అడుగులు కాగా ప్రస్తుతం 1507.21 అడుగుల మేర ఉంది. 104.3066 టీఎంసీల నిల్వల ఉన్నట్టు జెన్‌కో అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 3219 క్యూసెక్కులు ఉండగా దిగువకు 1617.8 క్యూసెక్కులు వెళ్తోంది. ఏక్షణాన్నైనా బలిమెల డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ పర్యవేక్షణ అధికారులు తెలిపారు. గుంటవాడ జలాశయ నీటిమట్టం 1342.8 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 1525 క్యూసెక్కులు కాగా విద్యుత్ ఉత్పత్తికి 1276 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీజెన్‌కో అధికారులు అప్రమత్తమయ్యారు. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలోకి నీరు చేరే ప్రమాదం ఉన్నందున ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఏడీ జైపాల్, క్యాంప్ ఏఈ సురేష్ ప్రత్యేక సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. డీవాటరింగ్ నిమిత్తం రెండేసి మోటార్లను ఏర్పాటుచేశారు. గుంటవాడ ప్రాజెక్ట్ వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు. మెయిన్, రెగ్యులేటరీ డ్యామ్‌ల వద్ద డీజిల్, సైరన్‌ను సిద్ధం చేశారు.
ధారాలమ్మ ఘాట్ మూసివేత


