పునరావాస కేంద్రాలకు గిరిజనుల తరలింపు
సీలేరు: జీకే వీధి మండలం సీలేరు పోలీసుస్టేషన్ పరిధిలో ధారకొండ గాలికొండ పంచాయతీలకు చెందిన తోకరాయి. చట్రాపల్లి గ్రామాల ప్రజలను కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ అమిత్‌బర్దర్ ఆదేశాలతో సీలేరు ఎస్‌ఐ యాసీన్ ఆధ్వర్యంలో 250 మంది గిరిజనులు సురక్షిత ప్రాంతాలకు మంగళవారం తరలించారు. సీలేరు పోలీసులు తోకరాయి, చట్రాపల్లి గ్రామాలకు వెళ్లి స్థానికులకు తుపాను అప్రమత్తత, జాగ్రత్తలపై అవగాహన కల్పించి, వారిని ప్రత్యేక వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందులో భాగంగా తోకరాయి గ్రామంలో ఉన్న 65 కుటుంబాల గిరిజనులు ధారకొండ సచివాలయం భవనంలోను, చట్రాపల్లి గ్రామంలో ఉన్న ఆరు కుటుంబాలను సప్పర్ల ప్రభుత్వ పాఠశాలలో ఉంచారు. వీరికి ఎస్‌ఐ యాసీన్ ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించి వారికి భోజన సదుపాయాలను కల్పించారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సంప్రదించాలని అందుబాటులో పోలీస్ సిబ్బంది మహిళా పోలీస్ విఆర్వోలు ఉన్నారని వారికి భరోసా కల్పించారు.
గత సంఘటన పునరావృతం కాకుండా...
గత ఏడాది సెప్టెంబరు 8 న ఈ ప్రాంతంలో సంభవించిన భారీ తుపానుతో తోకరాయి, చట్రాపల్లి గ్రామ సమీపంలోని కొండచరియలు జారి పడడంతో బాటు, భారీ చెట్లు గ్రామ సమీపానికి కొట్టుకు వచ్చి పెను నష్టం సంభవించింది. చట్రాపల్లి గ్రామంలో ఇద్దరు మృత్యువాత పడగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
గత సంఘటనలను దృష్టిలో పెట్టుకుని మోంథా తుపాను నేపద్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తోకరాయి గ్రామ ప్రజలను ధారకొండ ఆశ్రమ పాఠశాలకు, చట్రాపల్లి గ్రామ ప్రజలను సప్పర్ల ఆశ్రమ పాఠశాలకు సీలేరు ఎస్‌ఐ యాసిన్ తమ సిబ్బందితో కలసి వాహనాలను తీసుకెళ్ళి వారిని తరలించి అక్కడ అవసరమైన వసతి, ఆహార ఏర్పాట్లను చేశారు.
అప్రమత్తంగా ఉండాలి
తుపాను తీవ్రతరం కానుండడంతో శివారు గ్రామ గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని సీలేరు ఎస్‌ఐ యాసీన్ సూచించారు. ఎవరు బయటకు రావద్దని అత్యవసరమైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వాగులు, గెడ్డలు దాటవద్దని మంగళవారం తమ సిబ్బందితో కలిసి గ్రామాల్లో ప్రచారం చేపట్టారు.
తోకరాయి, చట్రాపల్లి గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన యంత్రాంగం


