వరి పొలాల్లో నీటిని తొలగించాలి
అనకాపల్లి: మోంథా తుఫాన్ ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉంటూ వరి పొలాల్లో నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ సీహెచ్.ముకుందరావు సూచించారు. మండలంలో తుమ్మపాలలో వరి పొలాలను శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఒకట్రెండు చోట్ల లోతట్టు ప్రాంతాలు మినహా వరి పంట ఇప్పటి వరకు నీట మునగలేదన్నారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో వరి పిలక దశలో ఉందన్నారు. ఈ దశలో నష్టం తక్కువగా ఉంటుందని, పూత దశలో గానీ, పొట్ట దశలో గానీ పంటకు నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. వరి పంట పాలు పోసుకునే దశలో ఉంటే, పొలంలో నీటిని కాలువల ద్వారా తొలగించి, తెగుళ్ల నివారణ కోసం వర్షాలు తగ్గిన వెంటనే ఎకరానికి 200 మిల్లీలీటర్ల ప్రొపికోనిజోల్ మందును చల్లుకోవాలన్నారు. పంట గింజ గట్టిపడే దశలో ఉంటే వర్షపునీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించి, గింజ మొలకెత్తకుండా ఐదు శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాముల ఉప్పును లీటరు నీటికి) కలిపి పంటపై పిచికారీ చేయాలన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్‌రావు మాట్లాడుతూ దిమిలి, కట్టుబోలు గ్రామాల్లో శారదా నది గట్టు తెగిపోకుండా ఇసుక బస్తాలతో పటిష్టపరిచే చర్యలను తీసుకున్నామన్నారు. రైతులకు తగిన సలహాలు సూచనలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ డి.ఉమామహేశ్వరరావు, మండల వ్యవసాయశాఖ అధికారి సుమంత, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఏడీఆర్ ముకుందరావు, అనకాపల్లి జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్‌రావు


