బోసిపోయిన రైల్వేస్టేషన్
● పలు రైళ్ల రద్దు, కొన్ని దారి మళ్లింపు
● ఆలస్యంగా బయలుదేరిన పలు రైళ్లు
తాటిచెట్లపాలెం (విశాఖ): తుఫాన్ దృష్ట్యా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. వీటిలో ఇక్కడ నుంచి బయల్దేరాల్సిన, విశాఖపట్నం చేరుకోవలసిన పలు రైళ్లు ఉన్నాయి. మరికొన్ని రైళ్లు దారిమళ్లించారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా ఈ సమాచారాన్ని ముందుగానే ప్రయాణికులకు చేరవేయడంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. దీంతో విశాఖ రైల్వేస్టేషన్ మంగళవారం నిర్మానుష్యంగా మారింది. సమాచారం తెలియక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నారు. మంగళవారం మొత్తంగా 19 రైళ్లను రద్దు చేయగా 11 రైళ్లు ఆలస్యంగా బయలుదేరాయి. మరో రెండు రైళ్లను దారి మళ్లించారు. బుధవారం కిరండూల్–విశాఖపట్నం(18516)నైట్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–మచిలీపట్నం(17220) ఎక్స్‌ప్రెస్, రాయగడ–గుంటూరు(17244)ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్–హైదరాబాద్(07166) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. 30వ తేదీన లోకమాన్యతిలక్ టెర్మినస్–విశాఖపట్నం(18520) ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్, ముంబయి–భువనేశ్వర్(11019)కోణార్క్ ఎక్స్‌ప్రెస్, పూరీ–తిరుపతి(17479)ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయి.
బోసిపోయిన రైల్వేస్టేషన్


