వైద్య కళాశాలలు ప్రైవేటీకరిస్తే ఊరుకోం
● ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వలరాజు, నాసార్జీ
● పాడేరు చేరుకున్న బస్సు యాత్ర
● స్థానిక వైద్య కళాశాల వద్ద ఆందోళన
పాడేరు : కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటీకరిస్తే ఊరుకునేంది లేదని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అద్యక్ష, కార్యదర్శులు వలరాజు, నాసార్జీ హెచ్చరించారు. విద్యారంగ సమస్యలపై అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) రాష్ట్ర సమితి చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర ఆదివారం పాడేరు చేరుకుంది. ఇందులో భాగంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రతినిధి బృందం స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించింది. ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేయడంతో పాటు సమస్యలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు బస్సు యాత్ర చేపట్టమన్నారు. రాష్ట్రంలో గిరిజన, పేద విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. ఆశ్రమాల్లో విద్యార్థులు అనారోగ్యం బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు రూ.6400 కోట్లు బకాయి విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ మోసం చేస్తోందని విమర్శించారు. గిరిజన ప్రాంతంలోని ఆశ్రమ వసతి గృహాల్లో హెల్త్ వలంటీర్లను నియమిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా దగా చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని నీరుగార్చేందుకు తమ స్వలాభం కోసం ప్రైవేటుపరం చేయడం మానుకోవాలన్నారు. ప్రజావైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు ఫణీంద్ర, కుళస్వామి, నాగభూషణం, మస్తాన్, కృష్ణ, తనీష్, జగదీష్, శ్రీనివాసరెడ్డి, అబ్బులు పాల్గొన్నారు.


