‘తినలేక...ఆకలితో ఉంటున్నాము’
ముంచంగిపుట్టు: ప్రతి రోజు మెనూ అమలు కావడం లేదు.. పెడుతున్న భోజనాలు సరిగ్గా ఉడకడం లేదు..ఎక్కువగా బంగాళదుంప కూరనే వండుతున్నారు.. మెనూపై ప్రశ్నిస్తే దురుసుగా ప్రవహిస్తున్నారు.. తినలేక కొన్ని సందర్భాల్లో ఆకలితో ఉంటున్నామని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదివారం ఆల్పాహారం సరిగ్గా ఉడకకపోవడంతో మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–1 విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. మా సమస్యలు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, గిరిజన సంఘం నేతలకు తెలియజేసి వారి ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో నిరసన చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సక్రమంగా మెనూ అమలు చేయడం లేదని ఆరోపించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలే వార్డెన్ కావడంతో గత్యంతరం లేక పెట్టిందే తినాలి, ఉడకకపోయినా, రుచిగా లేకపోయినా సర్ధుకుపోతూ వస్తున్నామని వాపోయారు. ఈ విషయాన్ని ఏటీడీబ్ల్యూవో దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపించారు.
పాఠశాలలో 371 విద్యార్థినులకు 21 మరుగుదొడ్లు ఉండగా, వీటిలో 12 పూర్తిగా పాడైపోగా, ఉన్న మరుగుదొడ్లకు సక్రమంగా తలుపులు లేవని చెప్పారు. జ్వరాలు వస్తే పట్టించుకునే వారే లేరని, సమస్యలతో చదువుకుంటున్నామన్నారు. తక్షణమే తమకు మెనూ అమలు చేసి, సమస్యలు తీర్చాలని విద్యార్థినులు వాపోయారు.
పర్యవేక్షణ శూన్యం
ముంచంగిపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–1పై డిడి, ఏటీడబ్ల్యూవోల పర్యవేక్షణ పూర్తి కొరవడిందని, మెనూ అమలు కాక విద్యార్థులు అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం దారుణమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పాంగి కార్తీక్, శ్రీను, వైస్ ఎంపీపీ సత్యనారాయణ చెప్పారు. ఉడకని అన్నం, కూరలు, సక్రమంగా అమలు కాని మెనూతో గిరిజన విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదన్నారు. తక్షణమే అధికారులు స్పందించి పాఠశాలలో విద్యార్థుల సమస్యలను పరిష్కారించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రామకృష్ణ ఆశ్రమ పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం విద్యార్థుల కోసం వండిన ఆల్పాహారం తీని నాణ్యతపై అసహనం వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఫోన్‌లో ఇన్‌చార్జి ఏటీడబ్ల్యూవో జగత్‌రాయ్‌కు తెలియజేశారు. దీంతో హూటహూటిన పాఠశాలకు వచ్చిన ఆయన విద్యార్థులతో మాట్లాడి మెనూ అమలు తీరుపై తెలుసుకున్నారు. మెనూ తీరుపై హెచ్‌ఎం, వార్డెన్ అయిన లక్ష్మీని మందలించారు. సక్రమంగా మెనూ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. లక్ష్మీపురం సర్పంచ్ త్రినాథ్, గిరిజన సంఘం నేతలు గాసిరాం దొర, శ్రీను,నారాయణ, గిరిజన మహిళ సంఘం మండల కార్యదర్శి ఈశ్వరి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చరణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
మెనూ అమలు కావడం లేదు..భోజనాలు ఉడకడం లేదు
ముంచంగిపుట్టు పాఠశాల ఆవరణలో గిరిజన విద్యార్థుల ఆందోళన
ఉదయం అల్పాహారం బాగోలేక నిరసనకు దిగిన వైనం
కానరాని మౌలిక సదుపాయాలు.. తప్పని అవస్థలు
‘తినలేక...ఆకలితో ఉంటున్నాము’
‘తినలేక...ఆకలితో ఉంటున్నాము’
‘తినలేక...ఆకలితో ఉంటున్నాము’


