గిరి రైతుల్లో గుబులు
● వెంటాడుతున్న తుపాను భయం
● దిగుబడి దశలో వరి, రాగుల పంటల
● ఆందోళనలో రైతాంగం
సాక్షి,పాడేరు: బంగళాఖాతంలో ఏర్పడునున్న మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నప్పటికి గిరిజన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఖరీఫ్‌లో గిరిజన రైతులు 56వేల హెక్టార్లలో వరి, 17వేల హెక్టార్లలో రాగులు, చిరుధాన్యాల పంటలను సాగు చేశారు. ఈ పంటలన్నీ ప్రస్తుతం దిగుబడి దశలో కళకళాడుతున్నాయి. నవంబర్ నెల నుంచి పంట కోతలకు గిరిజన రైతులు సిద్దమవుతున్న తరుణంలో అల్పపీడన భయం నెలకొంది. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ ప్రకటనలతో గిరిజన రైతుల్లో కలవరం ఏర్పడింది. లోతట్టు వ్యవసాయ భూముల్లో పంటలపై రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. గతంలోను అనేక తుపానులలో ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లిన పరిస్థితిని గుర్తిచేసుకుంటున్న రైతులు భారీ వర్షాలు కురవకూడదని భావిస్తున్నాన్నారు. తిండి గింజల కోసమే వరి, రాగులు, ఇతర చిరుధాన్యాల పంటలను గిరిజన రైతులు సాగు చేస్తుంటారు. పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లే ప్రభావం తీవ్రంగా ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిసే పరిస్థితులలో లోతట్టు పంట భూముల్లో వర్షం నీరు నిల్వ ఉండకుండా కాలువాలు తవ్వుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
భారీ వర్షాలు కురిస్తే నష్టమే
భారీ వర్షాలు కురిస్తే పంటలకు నష్టం ఏర్పడుతుంది.లోతట్టు భూముల్లో వరిపంటను సాగు చేస్తున్నాను.దిగుబడి దశలో పంట ఉంది.ఈ పరిస్థితులలో ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో భయంగా ఉంది. భారీ వర్షాలు కురిస్తే పంటలు ముంపునకు గురవుతాయి. రాగుల పంట నేలవాలే ప్రమాదం ఉంది.
– వంతాల మోహనరావు, గిరిజన రైతు, రంగిలిసింగి పంచాయతి, డుంబ్రిగుడ మండలం
గిరి రైతుల్లో గుబులు


