గిరిజన గంగపుత్రుల జల దీక్ష
● కామునిగెడ్డ మినీ రిజర్వాయర్‌ను మేజర్ ఇరిగేషన్ ట్యాంక్‌గా గుర్తించాలని వినతి
రావికమతం: కామునిగెడ్డ మినీ రిజర్వాయర్‌ను మేజర్ ఇరిగేషన్ ట్యాంక్‌గా గుర్తించి చేపల పెంపకం ద్వారా జీవనోపాధి కల్పించాలని కోరుతూ గిరిజన మత్స్యకారులు ఆదివారం జలదీక్ష చేట్టారు. ధర్మవరం పంచాయతీలో కామునిగెడ్డ మినీ రిజర్వాయర్ పరిధిలో పాత ధర్మవరం, ధర్మవరం గ్రామాల్లో గధప (పీవీటీజీ) తెగకు చెందిన గిరిజనులు మినీ జలాశయంలో చేపల వేట ద్వారా జీవనం సాగిస్తున్నారు. వీరు 2022లో శ్రీపోతురాజుబాబు గిరిజన మత్స్యకార సహకార సంఘంగా ఏర్పడ్డారు. సంఘానికి మత్స్యశాఖ అధికారులు మొదటిలో చేపలు పంపిణీ చేసేవారని, తరువాత నిలిపివేశారని, దీని వలన ఉపాధి కోల్పోయి తమ జీవనోపాధి అగమ్యగోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోతురాజుబాబు గిరిజన మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు గోరా చిరంజీవి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు మాట్లాడుతూ ఇరిగేషన్ ట్యాంక్‌ను మేజర్ ఇరిగేషన్ ట్యాంక్‌గా నమోదు చేయాలని ఆగస్టు 11వ తేదీన జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశామని, దానిపై ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి 315.62 ఎకరాల విస్తీర్ణం ఉందని రిపోర్టు ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్‌వోసీ ఇచ్చినా నర్సీపట్నం మత్స్యకార శాఖ ఏడీ అధికారులు స్పందించలేదని, తక్షణమే అధికారులు స్పందించి మేజర్ ఇరిగేషన్ ట్యాంక్‌గా గుర్తిస్తే మత్స్యకార సంఘానికి ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు అందుతాయని, దీనిపై నర్సీపట్నం ఫిషరీస్ ఏడీ, సంబంధిత అధికారులు తక్షణమే మేజర్ ఇరిగేషన్ ట్యాంక్‌గా గుర్తించి న్యాయం చేయాలని కోరారు.


