137 కిలోల గంజాయి స్వాధీనం
● విలువ రూ.13 లక్షలు
● ముగ్గురి అరెస్టు, ఇద్దరు పరారీ
చింతపల్లి: ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న రూ.13 లక్షల విలువైన 137 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశామని సీఐ వినోద్‌బాబు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముందస్తు సమాచారం మేరకు అన్నవరం ఎస్‌ఐ వీరబాబు, సిబ్బందితో లోతుగెడ్డ వంతెన వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. కారు, రెండు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా 137 కిలోల మూడు గంజాయి మూటలను గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితుల నుంచి కారు, రెండు బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. చింతపల్లికి చెందిన ఇద్దరు, గూడెంకొత్తవీధికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో ఇద్దరు పరారీ అయ్యారని, వీరు చింతపల్లి మండలానికి చెందిన వారుగా గుర్తించామన్నారు. గంజాయిని నర్సీపట్నం తరలిస్తున్నట్టుగా తమ దర్యాప్తులో తేలిందని సీఐ తెలిపారు.


