గల్లంతైన మత్స్యకారుడు క్షేమం
● ఆదుకున్న ఉప్పాడ జాలర్లు
మహారాణిపేట: పెదజాలరిపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు రామోలు ఎల్లాజీ ఆచూకీ లభ్యమైంది. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఎల్లాజీ క్షేమంగా ఉన్నట్టు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 24న ఎల్లాజీ చేపల వేటకు వెళ్లగా.. ఆయన ఆచూకీ తెలియకుండా పోయింది. అయితే 25న కాకినాడ జిల్లా, తొండంగి మండలం, హూకుంపేట సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరంలో ఎల్లాజీ ఆచూకీ లభించినట్టు జాయింట్ డైరెక్టర్ వివరించారు. సముద్రంలో కొట్టుకు వచ్చిన ఎల్లాజీని ఉప్పాడకు చెందిన మత్స్యకారులు గమనించి, ఒడ్డుకు తీసుకువచ్చి ఆదరించారు. పెదజాలరిపేటకు చెందిన పెద్దలు తెడ్డు రాజు, పర్సన్న ఆదివారం ఉప్పాడ వెళ్లి.. ఎల్లాజీని విశాఖపట్నం తీసుకొచ్చారు. ఎల్లాజీ క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు, తోటి మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.


