సిగనాపల్లి క్వారీలో రంగురాళ్ల తవ్వకాలు
● ముగ్గురి అరెస్టు
● పెదవలస రేంజ్ అధికారి ప్రశాంతి కుమారి వెల్లడి
చింతపల్లి: సిగనాపల్లి రంగురాళ్ల క్వారీలో తవ్వకాలు జరుపుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పెదవలస ఇన్‌చార్జ్ రేంజ్ అధికారి కె.ప్రశాంతికుమారి తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సిగనాపల్లి రంగురాళ్ల క్వారీలో తవ్వకాల నిరోధానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే సిబ్బందితో బేస్ క్యాంపులు,స్ట్రైకింగ్ ఫోర్సుతో గస్తీ చేపట్టామన్నారు. క్వారీ ప్రాంతంలో 144 సెక్షన్ కూడా అమలులో ఉందన్నారు. తాజాగా ఈ క్వారీలో తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని మూసివేశామన్నారు. ఈ నేపథ్యంలో గురువారం కొత్తపాలెం గ్రామానికి చెందిన గెమ్మిలి చిట్టిబాబు, ధారకొండకు చెందిన భీమవరపు గణేష్, బూదరాళ్లకు చెందిన ఉప్పల బాలాజీరావు తవ్వకాలు జరుపుతుండగా తమ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చామన్నారు. సెక్షన్ అదికారి నూకరాజు, ఎఫ్‌బీవో గోపి తదితరులు పాల్గొన్నారు.


