ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడాలి
● పాడేరు ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ
● బంగారుమెట్ట ఆశ్రమ పాఠశాల,
కించాయిపుట్టు అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ
ముంచంగిపుట్టు : ఉపాధ్యాయుల పనితీరు బాగోలేదని, మెరుగుపడాలని బంగారుమెట్ట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల ఉపాధ్యాయులకు ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ సూచించారు. ముంచంగిపుట్టు మండలంలో గురువారం ఐటీడీఏ పీవో సుడిగాలి పర్యటన చేశారు. కించాయిపుట్టు పంచాయతీ కేంద్రంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లగా కేంద్రం మూసి ఉండడంపై పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ టీచర్ ఇంటిలో కేంద్రం నిర్వహణ చేస్తూ ఉండడం, అంగన్‌వాడీ భవనం శిథిలావస్థలో ఉండడంతో గ్రామంలో నిరుపయోగంలో పాఠశాల భవనానికి మరమ్మతులు చేసి అంగన్‌వాడీ నిర్వహణ జరపాలని అధికారులకు ఆమె సూచించారు. అనంతరం బంగారుమెట్ట ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థుల సామర్థ్యాలకు నిర్వహించిన పరీక్ష పేపర్లను ఆమె పరిశీలించారు. పేపర్లు సరిగా ఉపాధ్యాయులు దిద్దక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పీవో సూచించారు.
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..
పెదబయలు : వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సమయపాలన పాటించాలని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. గురువారం పెదబయలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీ రికార్డులు పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మందుల నిల్వను పరిశీలించి, ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలని, వైద్య సిబ్బంది అకింతభావంతో పని చేయాలని, రోగులు ఉండే వార్డులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం అరడకోట గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు నిర్వహిస్తున్న డిజిటల్ క్లాసులను పరిశీలించి, విద్యార్థుల సామర్థ్యాలపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పాఠశాల రికార్డులు పరిశీలించారు.
ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడాలి


