మలేరియా ప్రబలకుండా పటిష్ట చర్యలు
పాడేరు : జిల్లా వ్యాప్తంగా మలేరియా ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ వెల్లడించారు. గురువారం ఆయన స్థానిక జిల్లా మలేరియా కార్యాలయాన్ని తనిఖీ చేశారు. జిల్లా మలేరియా అధికారి తులసితో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీల్లో నమోదైన మలేరియా కేసుల వివరాలను తెలుసుకున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా అధికంగా పాడేరు డివిజన్‌లో మూడు పీహెచ్‌సీల్లో, రంపచోడవరం డివిజన్ పరిధిలోని పీహెచ్‌సీల్లో తొమ్మిది, చింతూరు డివిజన్ పరిధిలో ఆరు పీహెచ్‌సీలో పరిధిలో మలేరియా తీవ్రత ఉందన్నారు. ఆయా పీహెచ్‌సీల పరిధిలోని గ్రామాల్లో మలేరియా రోగులకు అందించిన చికిత్సలు, ప్రబలకుండా తీసుకున్న జాగ్రత్తలను ఆయన తెలుసుకున్నారు. మలేరియా సిబ్బందితో పాటు ఫీల్డ్ విజిట్‌కు వెళ్తున్న వైద్య సిబ్బంది నిత్యం గ్రామాల్లో మలేరియాపై పర్యవేక్షణ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీహెచ్‌సీల నుంచి జిల్లా ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్న కేసుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా కార్యాలయానికి అందజేయాలని సూచించారు. జిల్లా కార్యాలయంలో మలేరియా సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించాలని ఆదేశించారు.
సమయపాలన పాటించకుంటే చర్యలు
డుంబ్రిగుడ: వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో డాక్టర్ డి కృష్ణమూర్తి నాయక్ హెచ్చరించారు. గురువారం ఆయన స్థానిక పీహెచ్‌సీని తనిఖీ చేశారు. సిబ్బంది అటెండెన్స్, మూమెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుఖ ప్రసవాలు ఎక్కువగా జరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. బాలింతలతో మాట్లాడారు. తల్లిపాల ప్రాముఖ్యత, వ్యాధి నిరోధక టీకాలు, పౌష్టికాహరంపై అవగాహన కల్పించారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న ప్రసవ నిరీక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆయన గర్భిణులతో మాట్లాడారు. అనంతరం సిబ్బంది నుంచి మలేరియా కేసుల వివరాలు తెలుసుకున్నారు. స్టోర్ రూమ్‌లో మందులు, వ్యాక్సిన్లు పరిశీలించారు. పీహెచ్‌సీ పరిశుభ్రంగా ఉన్నందున సిబ్బందిని అభినందించారు.
డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయక్
మలేరియా ప్రబలకుండా పటిష్ట చర్యలు


