జెండాలు పాతిన పొలాలు రైతులకు అప్పగింత
ఎటపాక: గిరిజన సంఘం ఆధ్వర్యంలో జెండాలు పాతిన సాగు భూములను గిరిజనేతర రైతులకు అధికారులు గురువారం అప్పగించారు. నందిగామ, మూరుమూరు గ్రామాల పరిధిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునుకు గురవుతున్న సాగు భూములకు గిరిజనేతర రైతులు నష్ట పరిహారం పొందారు. అయితే సదరు రైతులు స్థానికంగా నివాసం లేకుండా అట్టి భూములు కౌలుకు ఇస్తున్నారని ఆ భూములు గిరిజనులకే చెందాలంటూ ఇటీవల గిరిజనులు జెండాలు పాతడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమను పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులుగా గుర్తించి పూర్తి పరిహారం ఇచ్చి ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించేవరకు తమ ముంపు భూములు తామే సాగుచేసుకుంటామని గిరిజనేతర రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. దీంతో గిరిజనేతర రైతులు వారి భూములకు వారే హక్కుదారులని సబ్‌కలెక్టర్ ఆదేశాలు కూడా జారీచేశారు. ఈక్రమంలో గురువారం రైతులు వారి భూముల్లో దుక్కులు చేసుకుంటుండగా జెండాలు పాతిన గిరిజనులు అక్కడకు వచ్చి అడ్డుకున్నారు. ఈసమాచారం తెలుసుకున్న తహసీల్దార్ కారం సుబ్బారావు,సీఐ కన్నపరాజు మురుమూరు,నందిగామ గ్రామాలకు వెళ్లి గిరిజనులతో మాట్లాడారు. ముంపు భూముల్లో జెండాలు ఏర్పాటు చేయడం సరికాదని అట్టి భూములు హక్కుదారులే సాగుచేసుకుంటారని చెప్పారు. కాగా పరిహారం పొందిన భూముల్లో సదరు రైతులే సాగు చేసుకోవాలని, ఎవరికై నా కౌలుకు ఇస్తే రైతులపై ఎల్‌టీఆర్ కేసులు నమోదు చేస్తామని గిరిజనేతర రైతులను హెచ్చరించారు. సమస్యను పరిష్కరించి ముంపు భూములను రైతులకు అప్పగించామని తహసీల్దార్ తెలిపారు.


