హుండీ ఆదాయం లెక్కింపు
సీలేరు: గూడెంకొత్తవీధి మండలంలోని ధారకొండ ధారాలమ్మ ఆలయ హుండీని గురువారం లెక్కించారు. ఎండోమెంట్ కార్యనిర్వహణాధికారి సాంబశివరావు, స్థానికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. భక్తులు సమర్పించిన కానుకలు, నగదు రూ.7,40,192 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ప్రత్యేక అధికారి తేజ తదితరులు పాల్గొన్నారు.
సరిహద్దులోఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ఎటపాక: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్‌ఐ అప్పలరాజు బుధవారం రాత్రి పట్టుకున్నారు. తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులో ఇసుకను డంప్ చేసి అక్కడ నుంచి ట్రాక్టర్లలో సరిహద్దున ఉన్న తెలంగాణ రాష్ట్రం భద్రాచలం పట్టణానికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
విదేశీయుల సందడి
ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం, ఒనకఢిల్లీ వారపు సంతలో గురువారం విదేశీయలు సందడి చేశారు. ఆస్ట్రేలియా, దక్షణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తదితర దేశాలకు చెందిన 40మంది మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. విద్యుత్ ఉత్పత్తి,నిర్వహణను తెలుసుకున్నారు. వించ్ హౌస్‌లో ప్రయాణించి, వింత అనుభూతి పొందారు. ఒనకఢిల్లీ వారపు సంతకు బోండా, గదబ గిరిజనుల వేషధారణ, సంస్కృతి,సంప్రదాయ వివరాలను తెలుసుకున్నారు. వారు అమ్మే పూసలు,రింగులు కొనుగోలు చేయడమే కాకుండా వారితో సెల్ఫీలు, ఫొటోలు తీసుకుని సందడి చేశారు.


