18 గ్రామాల్లో జనగణన ప్రీ టెస్టింగ్
డీఆర్‌వో పద్మలత
సాక్షి,పాడేరు: 2027లో నిర్వహించనున్న జనగణనకు సంబంధించి జిల్లాలో జి.కె.వీధి మండలంలో 6 పంచాయతీల్లోని 18 గ్రామాల్లో ప్రీ టెస్టింగ్ నిర్వహిస్తున్నామని డీఆర్‌వో కె.పద్మలత తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గురువారం అధికారులతో కలెక్టరేట్ నుంచి వీడియో సమావేశం ద్వారా శిక్షణ ఇచ్చారు. జనాభా లెక్కల విభాగం సమన్వయకర్త ప్రసన్నకుమార్, మరో ముగ్గురు అధికారులు కలిసి సమగ్ర శిక్షణ అమలుజేశారు. ఈ సందర్భంగా డీఆర్‌వో మాట్లాడుతూ రెండు దశల్లో జనగణన జరుగుతుందన్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా తొలుత సేకరించిన సమాచారాన్ని సెన్సస్ మేనేజ్‌మెంట్ అండ్ మోనటరింగ్ సిస్టంలో పొందుపరుస్తామన్నారు. ప్రతి 250 నుంచి 800 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ ద్వారా జనగణన జరుగుతుందన్నారు. మండల రెవెన్యూ అధికారి చార్జి అధికారిగా కీలకపాత్ర వహిస్తారన్నారు. ప్రిన్సిపల్ సెన్సెస్ అఽధికారి నోడల్ అధికారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జనగణన ప్రక్రియ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ప్రసాద్, జి.కె.వీధి, పాడేరు రెవెన్యూ అధికారు లు, సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
వీడియో సమావేశం నిర్వహిస్తున్నడీఆర్‌వో పద్మలత, ఇతర అధికారులు


