యువకుడి ఆత్మహత్య
● తల్లి మృతితో మనస్తాపానికి గురై
ఉరివేసుకున్న వైనం
● ధారకొండలో విషాదఛాయలు
సీలేరు: గూడెంకొత్తవీధి మండలం ధారకొండ గ్రామానికి చెందిన కాలం కున్నత్ సునీల్ కుమారుడు నిఖిల్ (17) విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఉరివేసుకొని మృతి చెందాడు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సునీల్ తన భార్య, కుమారుడితో కలిసి కంచరపాలెంలో నివాసముంటున్నాడు. సునీల్ నగరంలోని ఓ నగల దుకాణంలో పనిచేస్తుండగా, అతని భార్య ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేవారు. వీరి కుమారుడు నిఖిల్ మధురవాడలోని పాలిటెక్నిక్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే సునీల్ భార్య మే నెలలో గుండెపోటుతో మృతి చెందడంతో నాటి నుంచి కుమారుడు నిఖిల్ మనస్తాపానికి గురయ్యాడు. అందరితో ముభావంగా ఉండేవాడని స్థానికులు తెలిపారు. నిఖిల్ దాచుకున్న సొమ్ముతో తన తల్లి బతికున్నప్పుడు ఓ చీరను గిఫ్ట్‌గా ఇచ్చాడు. తల్లి మృతితో నిఖిల్ మనస్తాపం చెంది గురువారం తండ్రి లేని సమయంలో తన తల్లికి గిఫ్ట్‌గా ఇచ్చిన చీరతో, చేతిలో తల్లి ఫొటోతో కప్‌బోర్డు డోర్‌కు ఉరివేసుకొని చనిపోయినట్టు స్థానికులు తెలిపారు. నిఖిల్ మరణవార్తతో ధారకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి.


