బ్లేడుతో పీక కోసుకున్నమతిస్థిమితం లేని వ్యక్తి
వై.రామవరం: మండలకేంద్రం వై.రామవరం శివారులోని కొండవాగు పక్కన గుట్టపై ఉన్న శివాలయం వద్ద బుధవారం కాళ్ళ దాసు (45) అనే వ్యక్తి బ్లేడుతో పీక కోసుకున్నాడు. ఆ మార్గంలో నడచి వెళుతున్న కొంతమంది రక్తపు మడుగులో పడిఉన్న అతనిని గమనించి స్థానిక సీహెచ్‌సీకి 108లో తరలించారు. సూపరింటెండెంట్ చైతన్యకుమార్ ఆధ్వర్యంలో వైద్యసేవలు అందిస్తున్నారు. గాయపడిన వ్యక్తి మండల సరిహద్దు ప్రాంతమైన కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ కంపమామిడి గ్రామస్తుడు. కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు రోజులుగా కనిపించకపోవడంతో గాలిస్తున్నట్టు చెప్పారు. ఈవిషయాన్ని స్థానికులు తమకు తెలియజేయడంతో ఆస్పత్రికి వెళ్లినట్టు తెలిపారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందని సూపరింటెండెంట్ చైతన్యకుమార్ తెలిపారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


