గిరిజనేతరుల భూముల్లోజెండాలు పాతిన ఆదివాసీలు
కూనవరం : పోలవరం నిర్వాసితులైన గిరిజనేతరుల భూముల్లో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం జెండాలు పాతారు. పరిహారం పొందిన తరువాత కూడా గిరిజనేతరులు ఆ భూముల్లో వ్యవసాయం చేయడం చట్టవిరుద్ధమని గిరిజన సంఘం నాయకులు తెలిపారు. 1/70 చట్టం ప్రకారం ఆ భూములను గిరిజనులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఈవిషయంపై స్థానిక తహసీల్దార్, ఐటీడీఏ పీవో, కలెక్టర్‌లకు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. అధికారుల నుంచి ఏవిధమైన స్పందన లేకపోవడంతో జెండా లు పాతినట్టు చెప్పారు. ఈకార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు పాయం సీతారామయ్య, పెదార్కూరు ఎంపీటీసీ ధర్ముల అమ్మాజీ, సర్పంచ్ మడకం నాగమణి, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు తెల్లం తమ్మయ్య, బాబు బొర్రయ్య, ఆదివాసీ రైతులు కుంజా వెంకటరావు, కట్టి మారయ్య, కట్టి తమ్మయ్య, కుంజా శ్రీను, కట్టి శ్రీను పాల్గొన్నారు.


