అక్రమార్కులు
సరిహద్దు మీరుతున్న
ఎటపాక: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో అధికార పార్టీకి చెందిన నాయకులు అక్రమ సంపాదనే ధ్యేయంగా ఇసుక అక్రమ తరలింపునకు తెర లేపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల పేరుతో ఉచితంగా ఇసుక పొంది ట్రాక్టర్లు, టిప్పర్లతో పక్క రాష్ట్రానికి తరలించేస్తున్నారు. ఇసుక అక్రమ దందాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. దీనికి రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన మన రాష్ట్రంలోని గుండాల ఇసుక స్టాక్ పాయింట్ అడ్డాగా మారింది. ఆంధ్రా నుంచి తెలంగాణ సరిహద్దు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో రాత్రీపగలు అన్న తేడాలేకుండా అక్రమంగా పెద్ద ఎత్తున ఇసుకను తరలించేస్తున్నారు. ఇంతకు ముందు రాత్రి సమయంలో గోదావరి నుంచి ఇసుకను తోడి తెలంగాణకు తరలించేవారు. అయితే నదిలో నీరు ఎక్కువగా ఉండడంతో అక్రమార్కులకు ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో వారి దృష్టి గుండాల స్టాక్‌పాయింట్‌పై పడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జాతీయరహదారి పక్కన ఈ స్టాక్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఆంధ్రా పరిధిలో ఉన్న గృహనిర్మాణాల కోసం లబ్ధిదారులకు వారి ఆధార్‌కార్డు ఆధారంగా ఇసుకను అందజేస్తున్నారు. కొన్నిరోజులు స్టాక్ నిర్వహణ సజావుగా సాగింది. తరువాత గాడి తప్పిందన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి.
కాసులు కురిపిస్తున్న స్టాక్ పాయింట్
ఈ స్టాక్ పాయింట్ నుంచి గృహ నిర్మాణాల కోసమని చెబుతూ మన రాష్ట్రంలో నివసిస్తున్న వారి ఆదార్ కార్డు ద్వారా ఇసుక పొంది, వేరే ప్రాంతాల్లో డంప్‌చేసి రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా తెలంగణ రాష్ట్రంలోని భద్రాచలం పట్టణానికి తరలిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఇసుకకు అధిక డిమాండ్ ఉండడంతో దానిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా స్టాక్‌పాయింట్ నుంచి నేరుగా తెలంగాణకు తరలించేస్తున్నారు. స్టాక్ పాయింట్‌లో టన్ను లోడింగ్‌కి రూ.183 వసూలు చేస్తారు. ట్రాక్టర్‌లో నాలుగు టన్నుల ఇసుక పడుతుంది. ట్రాక్టర్ ఇసుకను రూ.నాలుగు వేల నుంచి రూ.ఐదు వేల వరకూ విక్రయిస్తున్నారు. టిప్పర్‌లో 25 టన్నుల ఇసుక పడుతుంది. దీనిని రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ విక్రయిస్తూ అక్రమార్కులు జేబులు నింపుకొంటున్నారు. మరో పక్క ఆంధ్రాలోని చింతలగూడెం,కన్నాయిగూడెం శివారు ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకను నిల్వచేస్తున్నారు.
దొంగ వేబిల్లులతో...
తెలంగాణ లోని చర్ల ర్యాంపు నుంచి కొనుగోలు చేసినట్టు దొంగ వేబిల్లులు, ఇతర పత్రాలు సృష్టించి గుండాల స్టాక్ పాయింట్ నుంచి తెలంగాణ కు తరలిస్తున్నారే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్టాక్ పాయింట్‌పై పర్యవేక్షణ, సరిహద్దుల్లో నిఘా లేకపోవడంతో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. రోజుకు పదుల సంఖ్యలో ట్రిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. సొంత అవసరాలకు అని చెప్పి స్టాక్‌పాయింట్‌లో ఇసుకను పొంది, ట్రాక్టర్లు, లారీల్లో తెలంగాణ రాష్ట్రానికి తరలించి దర్జాగా విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం తెలిసినా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రా నుంచి తెలంగాణకు
యథేచ్ఛగా ఇసుక తరలింపు
బరితెగిస్తున్న మాఫియా
కాసులు కురిపిస్తున్న
గుండాల స్టాక్ పాయింట్
అక్రమార్కులు


