కొత్త విద్యుత్ కనెక్షన్‌కు ఫిక్స్‌డ్ చార్జీలు
● ఏపీఈపీడీసీఎల్‌లో నూతన విధానం
● ఇకపై అన్ని సర్కిళ్లలోనూ ఒకే రకమైన చార్జీలు
సాక్షి, విశాఖపట్నం: కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం ఇకపై ‘వన్ స్టేట్, వన్ చార్జ్’అమలు చేసేందుకు పంపిణీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. కనెక్షన్ల జారీలో ఏపీఈఆర్సీ నియమావళికి అనుగుణంగా నూతన విధానం అమలుకు ఏపీఈపీడీసీఎల్ శ్రీకారం చుట్టింది. కొత్త కనెక్షన్ పొందే విధానాన్ని మరింత సరళీకృతం చేయడంతో పాటు, కనెక్షన్ ప్రక్రియను సులభతరం చేయడం, చార్జీల అమలులో పారదర్శకతను తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఎలక్ట్రిసిటీ రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ రూల్స్–2020కి అనుగుణంగా ఏపీఈఆర్‌సీ ఈ సవరణలను సూచించింది. ఇకపై ఈపీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ఒకే విధమైన, పారదర్శక చార్జీలను అమలు చేయనుంది. ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్లు, ఎస్టిమేట్ తయారీ అవసరం లేకుండా వేగవంతమైన సేవలు అందించడం వల్ల..వినియోగదారులు ముందుగానే కనెక్షన్ చార్జీలపై స్పష్టమైన అవగాహన పొందేందుకు వీలుంటుంది. ఈ కొత్త విధానంలో భాగంగా 150 కిలోవాట్ల వరకు ఉన్న కనెక్షన్లకు స్థిర కనెక్షన్ చార్జీలు నిర్ణయించారు. అలాగే ఒక కిలోమీటర్ పరిధిలో ఇప్పటికే విద్యుదీకరణ జరిగిన ప్రాంతాల్లో, 150 కిలోవాట్ల వరకు లోటెన్షన్ (ఎల్‌టీ) విద్యుత్ కనెక్షన్ అడిగే వినియోగదారులు ఈ స్థిర చార్జీలకు అర్హులని స్పష్టం చేసింది. ఒక కిలోమీటర్ దూరానికి మించి ఉన్న ప్రాంతాలకు, కొత్త లేఅవుట్ల విద్యుదీకరణకు, వ్యవసాయ, అనుబంధ కనెక్షన్లకు, అండర్ గ్రౌండ్ కేబులింగ్ అవసరమయ్యే సందర్భాల్లో ఈ చార్జీలు వర్తించవు. అయితే అప్లికేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ వంటి ఇతర రుసుములు మాత్రం ప్రస్తుత నియమావళి ప్రకారం కొనసాగుతాయి.
వేగవంతంగా విద్యుత్ కనెక్షన్లు
గతంలో కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత సైట్ ఇన్‌స్పెక్షన్, ఎస్టిమేట్ తయారీ వంటి ప్రక్రియల ఆధారంగా కనెక్షన్ చార్జీలు నిర్ణయించేవారు. ప్రక్రియ పూర్తయ్యే వరకు వినియోగదారుడు ఎంత మొత్తం చెల్లించాలనేది స్పష్టంగా తెలిసేది కాదు. ఎస్టిమేట్‌పై ఆధారపడి సర్వీస్ లైన్ చార్జీలు, డెవలప్‌మెంట్ చార్జీలు వసూలు చేసేవారు. ఈ విధానంలో ప్రాంతం, దూరం, లోడ్ వంటి అంశాలపై చార్జీలు మారుతూ ఉండేవి. కొత్తగా అమలులోకి వచ్చిన విధానంలో 150 కిలోవాట్ల వరకు ఉన్న అన్ని కొత్త కనెక్షన్లకు, అదనపు లోడ్‌లకు కేటగిరీ ఆధారంగా స్థిర చార్జీలు నిర్ణయించారు. 20 కిలోవాట్ల వరకు (ఒక కిమీ పరిధిలో) ఉన్న కనెక్షన్‌లకు, గృహ వినియోగదారులకు మొదటి కిలోవాట్‌కు రూ.1,500, వాణిజ్య వి నియోగదారులకు (మొదటి కిలోవాట్‌కు) రూ.1,800 చొప్పున, తర్వాత ప్రతి అదనపు కిలోవాట్‌కు రూ.2 వేలు చొప్పున ధరలు నిర్ణయించారు. 20 నుంచి 150 కిలోవాట్ల వరకూ ప్రతి కిలోవాట్‌కు రూ.12,600 చొప్పున ధర ఉండనుంది. సగటు కనెక్షన్ ఖర్చు ఆధారంగా ఈ చార్జీలు నిర్ణయించామని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. ఇకపై సైట్ ఇన్‌స్పెక్షన్, ఎస్టిమేట్ అవసరం లేకుండా, దరఖాస్తు చేసుకున్న సమయంలోనే వినియోగదారుడు చెల్లించాల్సిన మొత్తం స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఫలితంగా, విద్యుత్ కనెక్షన్ జారీ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని స్పష్టం చేశారు. డెవలప్‌మెంట్ చార్జీలు, సర్వీస్ లైన్ చార్జీలతో కలిపి స్థిరంగా నిర్ణయించడం వల్ల ఎలాంటి అదనపు చార్జీల భారం వినియోగదారుడిపై పడదని సీఎండీ వివరించారు.


