ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టిన వ్యాన్
● మహిళ మృతి
● ఇద్దరికి తీవ్ర, తొమ్మిది మందికి స్వల్పగాయాలు
గూడెంకొత్తవీఽధి: మండలంలోని రింతాడ మాలి సెంటర్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో తొమ్మిది మందికి స్వల్పగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. సంకాడ పంచాయతీ చిత్తమామిడికి చెందిన గ్రామస్తులు చింతపల్లి సంతకు ఆటోలో కూరగాయలు తీసుకెళ్తున్నారు. ఆటోలో మొత్తం 12మంది ప్రయాణిస్తున్నారు. రింతాడ మాలి సెంటర్‌లో కూరగాయలు దించేందుకు ఆటోను ఆపారు. ఆగి ఉన్న ఆటోను ఆర్వీ నగర్ శాంతిసాధన పాఠశాలకు చెందిన బొలెరో వాహనం ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న తులసి(60) అక్కడే మృతిచెందగా, గణపతి, మోహన్ అనే ఇద్దరికి తీవ్ర గాయాలయవడంతో చింతపల్లి ఆస్పత్రికి ఆటోలో తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. గోవర్ధన్, ముకుంద్,బుజ్జిబాబు తదితర తొమ్మిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. గూడెంకొత్తవీధి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ
ప్రమాదంలో గాయపడిన వారిని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి వంతల చంటిబాబు, రింతాడ సర్పంచ్ భర్త వెంటరావు,ఎస్టీసెల్ అధ్యక్షుడు నారాయణ, పాతూను లక్ష్మణ్, ఉప సర్పంచ్ సోమేష్ కుమార్ ఆస్పత్రిలో పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.
ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టిన వ్యాన్
ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టిన వ్యాన్


